India Vs Pakistan: టీ20 ప్రపంచ కప్ 2021లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో 167 మిలియన్ల (16.70 కోట్లు) మంది వీక్షించారు. దీంతో ఇప్పటి వరకు అత్యధిక మంది వీక్షించిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌గా రికార్డు సాధించింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 అధికారిక ప్రసారకర్త అయిన స్టార్ ఇండియా ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు, టీ20 ప్రపంచకప్2016లో భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్ అత్యధిక మంది వీక్షించిన టీ20 మ్యాచ్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌ను 136 మిలియన్ల మంది వీక్షించారు. స్టార్ ఇండియా విడుదల చేసిన ఒక ప్రకటనలో, ఇప్పటివరకు మొత్తం 238 మిలియన్ల మంది టీ20 ప్రపంచ కప్‌ను వీక్షించారని తెలిపింది. ఇందులో క్వాలిఫయర్లు, సూపర్ 12 దశ మ్యాచ్‌లు ఉన్నాయి.
స్టార్ ఇండియా విడుదల చేసిన ప్రకటన ప్రకారం, 167 మిలియన్ల సంఖ్యతో అక్టోబర్ 24న జరిగిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అత్యధికంగా వీక్షించిన టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌గా మారింది. రెండేళ్ల తర్వాత ఐసీసీ టోర్నీలో ఈ రెండు జట్ల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో 2016 వరల్డ్ టీ20 సెమీఫైనల్‌లో భారత్-వెస్టిండీస్ మ్యాచ్ వెనుకబడింది.
‘భారత్-పాక్ మ్యాచ్ చరిత్ర సృష్టించింది. మేం కీలక జట్ల మ్యాచ్‌ల కోసం వీక్షకుల సంఖ్యను నిరంతరం పెంచుకుంటున్నాం. ఈ రికార్డ్ మా ప్రయత్నాలను చూపిస్తుందనడంలో సందేహం లేదు. మ్యాచ్ ఫలితం, టోర్నమెంట్ నుంచి టీమిండియా నిష్క్రమించడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారనడంలో సందేహం లేదు. అయితే రికార్డు వీక్షకుల సంఖ్య క్రికెట్ శక్తిని మరోసారి రుజువు చేసింది’ అంటూ స్టార్ ప్రతినిధి పీటీఐకి వివరించారు.
పాక్ చేతిలో భారత్ తొలిసారి ఓటమి..
టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్‌లు పరస్పరం తలపడిన మ్యాచ్ నుంచి తమ ప్రచారాన్ని ప్రారంభించాయి. ఇందులో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించి తొలిసారిగా ఐసీసీ పురుషుల ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడించింది. ఇంతకు ముందు భారత్ 50 లేదా 20 ఓవర్ల ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడిపోలేదు.
టీ20 ప్రపంచకప్ 2021లో కూడా భారత్ సెమీఫైనల్‌కు చేరుకోలేకపోయింది. పాకిస్థాన్‌తో పాటు, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడంతో టీ20 ప్రపంచకప్ 2021లో ముందుకు వెళ్లలేకపోయింది. దీంతో సెమీస్ చేరే జట్ల లిస్టులో చోటు సంపాదించలేకపోయింది. 2012 తర్వాత తొలిసారిగా ఐసీసీ ఈవెంట్‌లో భారత్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. కాకపోతే గత ఎనిమిదేళ్లలో ఆ జట్టు కనీసం ప్రతిసారీ సెమీఫైనల్‌కు చేరుకుంది.
T20 World Cup 2021: టాస్ ఓడినా, గెలిచినా.. మైదానంలో 100 శాతం ప్రదర్శన ఇవ్వాల్సిందే: విరాట్ కోహ్లీ