India vs Pakistan: భారత్‌పై పాకిస్తాన్ జట్టు బ్లాక్ బ్యాండ్‌తో ఆడుతోంది.. ఎందుకో తెలుసా..!

|

Aug 28, 2022 | 5:37 PM

Asia Cup 2022, India vs Pakistan: పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆదివారం ఆసియా కప్-2022 మొదటి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు దాని ఆటగాళ్ళు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు.

India vs Pakistan: భారత్‌పై పాకిస్తాన్ జట్టు బ్లాక్ బ్యాండ్‌తో ఆడుతోంది.. ఎందుకో తెలుసా..!
Pakistan Cricket Team
Follow us on

ఆసియా కప్-2022లో భాగంగా ఆదివారం పాకిస్తాన్ క్రికెట్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్‌తో తలపడనుంది. ప్రపంచం దృష్టి ఈ మ్యాచ్‌పైనే ఉంది. క్రికెట్ ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్ గురించే చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ జట్టు ఓ నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లు బ్లాక్ బ్యాండ్ ధరించి మైదానంలోకి దిగనున్నారు. ఆటగాళ్లు తరచుగా ఇలాంటి నల్ల బ్యాండ్‌తో ఆడుతుంటారు. ఈసారి కూడా అలాగే ఆడేందుకు రెడీ అవుతున్నారు. తమ దేశంలో వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు పాకిస్తాన్ ఆటగాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఓ పాకిస్తానీ జర్నలిస్ట్‌ ట్వీట్‌ చేశారు. ఈ సమయంలో పాకిస్తాన్‌లో వరద బీభత్సం కొనసాగుతోంది. ఈ విధ్వంసంలో చాలా మంది ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది ఇళ్లు కోల్పోయారు. పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూన్, బలూచిస్థాన్, సింధ్ ప్రావిన్స్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ వరదల కారణంగా దేశంలోని ఇతర ప్రాంతాలతో బలూచిస్థాన్‌కు కనెక్టివిటీ తెగిపోయింది.

వరద బీభత్సంతో..

పాకిస్తాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గత 24 గంటల్లో ఈ వరదల్లో 119 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం బలూచిస్తాన్‌కు చెందిన నలుగురు, గిల్కిత్ బాల్టిస్తాన్‌కు చెందిన ఆరుగురు, ఖైబర్ పఖ్‌టూన్‌కు చెందిన 31 మంది, సింధ్ ప్రావిన్స్‌కు చెందిన 76 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 110 జిల్లాలు ఈ వరదల బారిన పడ్డాయి. 72 జిల్లాలను వరద ప్రభావిత జిల్లాలుగా ప్రకటించారు. ఈ వరదల కారణంగా పాకిస్తాన్‌లో 33 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. జియో న్యూస్ అందించిన సమాచారం ప్రకారం, 950,000 ఇళ్లు ధ్వంసమయ్యాయి. వాటిలో 650,000 ఇళ్లు సగం శిథిలమయ్యాయి.

పాకిస్తాన్‌కు హై టెన్షన్..

ఈ మ్యాచ్‌ భారత్‌- పాకిస్థాన్‌లకు చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ఇరు జట్లూ భావిస్తున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిది గాయం కారణంగా ఆసియా కప్‌కు దూరమయ్యాడు. ఇది మాత్రమే కాదు, మహ్మద్ వసీం జూనియర్ కూడా వెన్ను గాయం కారణంగా తప్పుకున్నాడు. ఈ టోర్నీకి హసన్ అలీని జట్టులోకి తీసుకున్నారు. ఇంతకుముందు హసన్‌కు జట్టులో చోటు దక్కలేదు. అయితే షాహీన్ గాయం తర్వాత అతన్ని పిలిచారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం