Border Gavaskar Trophy: కెప్టెన్ రోహిత్ శర్మ లేడు, స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ కూడా గాయపడ్డాడు. ఈ క్రమంలో పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. దీంతో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరుంటారోననే ఆసక్తి పెరిగింది. ఈ ఇద్దరి స్థానాన్ని ఎవరు సరిగ్గా భర్తీ చేయగలరు? ఈ ప్రశ్న గత 3-4 రోజులుగా ప్రతి భారతీయ అభిమాని మదిలో మెదులుతోంది. పెర్త్ టెస్టులో బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎవరిని చేర్చాలనే విషయంలో టీమ్ ఇండియా ముందు పెద్ద చిక్కు వచ్చి పడింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్‌లో టీమిండియా కీలక ప్లేయర్లు లేకుండానే బరిలోకి దిగుతోంది. అలాగే, మరెన్నో ప్రయోగాలు చేసేందుకు సిద్ధమైంది. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంటుందో టీమ్ ఇండియా మేనేజ్ మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆప్టస్ స్టేడియంలో జరిగిన టీమిండియా తొలి ప్రాక్టీస్ సెషన్ నుంచే దీనికి సంబంధించిన సూచనలు కనిపించాయి.
ఆస్ట్రేలియా చేరుకున్నప్పటి నుంచి పెర్త్‌లోని డబ్ల్యూఏసీఏ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా, శుక్రవారం నుంచి సిరీస్‌లో మొదటి మ్యాచ్ జరగనున్న ఆప్టస్ స్టేడియంలో నవంబర్ 19 మంగళవారం నుంచి ప్రాక్టీస్ చేయడం ప్రారంభించింది. టీమిండియా మొదటి రోజు ప్రాక్టీస్ వర్షం కారణంగా ప్రభావితమైంది. దీని కారణంగా నెట్స్ సెషన్‌ను మధ్యలో ఆపవలసి వచ్చింది.
ఆప్టస్ స్టేడియం వెలుపల నెట్స్‌లో బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించే ముందు, టీమిండియా ఫీల్డింగ్‌లో విభిన్నమైన ఫీల్డింగ్ కసరత్తులు చేసింది. ఈ సమయంలో చూసిన దృశ్యం మ్యాచ్ ఆడబోయే ప్లేయింగ్ 11పై కీలక సూచనలు ఇచ్చినట్లైంది. ముఖ్యంగా బ్యాటింగ్ లైనప్ గురించి సూచలను ఇచ్చింది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, ఫీల్డింగ్ ప్రాక్టీస్ సమయంలో స్లిప్ కార్డన్ చేసినప్పుడు, దేవదత్ పడిక్కల్ మొదటి స్లిప్‌లో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌తో పాటు, విరాట్ కోహ్లీ రెండవ స్లిప్‌లో, కేఎల్ రాహుల్ మూడో స్లిప్‌లో ఉండగా, యశస్వి జైస్వాల్ గల్లీ పొజిషన్‌లో ఉన్నారు. ధ్రువ్ జురెల్ సిల్లీ పాయింట్‌లో ఉన్నాడు.
ఈ ఆటగాళ్లు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు సంపాదించడమే కాకుండా, ఫీల్డ్ పొజిషన్ కూడా అదే విధంగా ఉంటుందని చెప్పడానికి ఇది సరిపోతుంది. నివేదిక ప్రకారం, బ్యాట్స్‌మెన్‌లను వేర్వేరు నెట్‌లలో జోడీగా పంపారు. ఇందులో కేఎల్ రాహుల్ మొదటి నెట్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో ఉన్నారు. పడిక్కల్ తదుపరి నెట్ సెషన్‌లో విరాట్‌తో కనిపించాడు. ఇది శుభ్‌మాన్ గిల్ స్థానంలో పడిక్కల్ మూడవ స్థానంలో ఆడనున్నాడని సూచించడానికి సరిపోతుంది. రిషబ్ పంత్, జురెల్ తదుపరి లైన్‌లో అంటే నంబర్ 5, 6 స్థానాల్లో నిలిచాడు.
వీరంతా బౌలర్ల ముందు చాలా సేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయగా, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజాలు తమ పక్కనే ఉన్న నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ త్రోడౌన్ స్పెషలిస్ట్‌లను ఎక్కువగా ఎదుర్కొన్నారు. ఇందులో జడేజా ఆడటం ఖాయమని తెలుస్తోంది. అయితే, సర్ఫరాజ్ ఔట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. బ్యాకప్ ఓపెనర్‌గా ఆస్ట్రేలియాకు తీసుకెళ్లిన అభిమన్యు ఈశ్వరన్ దూరం నుంచి ప్రతిదీ గమనిస్తూనే ఉండగా, అతను కనీసం పెర్త్ టెస్ట్‌లో అరంగేట్రం చేయబోవడం లేదని, ఆప్టస్ స్టేడియంలో జైస్వాల్‌తో కలిసి రాహుల్ ఓపెనింగ్ చేస్తారని తెలుస్తోంది. టెస్టుకు ఇంకా 2 రోజుల కంటే ఎక్కువ సమయం ఉంది. ఈ సమయంలో టీమిండియా ఏమైనా మార్పులు చేయగలదా? లేదా అనేది త్వరలోనే తెలుస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..