ICC Saliva Ban: రూల్స్ పాటించాల్సిందే.. గిల్ రిక్వెస్టును చెత్త బుట్టలో వేసిన ఐసీసీ

ICC Saliva Ban: న్యూజిలాండ్‌తో తొలి టెస్టు డ్రా కావడంతో బంతిపై లాలాజలం ఉపయోగించే నిషేధాన్ని ఎత్తివేయాలని భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కోరాడు. అయితే ఐసీసీ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకునే ఆలోచనలో లేదు. కరోనా సమయంలో మొదలైన ఈ నిషేధం 2022లో శాశ్వతమైంది. ఐపీఎల్‌లో అనుమతి ఉన్నా అంతర్జాతీయ క్రికెట్‌లో ఎందుకు కొనసాగుతోందో తెలుసుకుందాం.

ICC Saliva Ban: రూల్స్ పాటించాల్సిందే.. గిల్ రిక్వెస్టును చెత్త బుట్టలో వేసిన ఐసీసీ
Icc Saliva Ban

Updated on: Nov 24, 2026 | 2:27 PM

ICC Saliva Ban: టెస్టు క్రికెట్‌లో బౌలర్లకు అనుకూల పరిస్థితులు కల్పించాలన్న భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ విజ్ఞప్తికి ఐసీసీ నుంచి ప్రస్తుతం సానుకూల స్పందన కనిపించడం లేదు. బంతిని మెరిపించేందుకు లాలాజలం ఉపయోగించడంపై విధించిన నిషేధాన్ని సమీక్షించే ఆలోచన లేదని ఐసీసీ వర్గాలు వెల్లడించినట్లు ప్రముఖ మీడియా వెల్లడించింది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు డ్రాగా ముగిసిన తర్వాత గిల్ ఈ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చాడు. బంతి త్వరగా మెత్తబడిపోవడం వల్ల బౌలర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అతడు అభిప్రాయపడ్డాడు.

బంతి త్వరగా మెత్తబడుతోందన్న గిల్

వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్ మైదానంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 720/9 స్కోరు చేసి డిక్లేర్ చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ చివరి రోజు 120 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 239/5 స్కోరుతో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. దీంతో భారత్‌కు కీలక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్లు దక్కలేదు. ఈ మ్యాచ్‌లో కూకబురా బంతి చాలా త్వరగా మెత్తబడిపోతోందని గిల్ చెప్పాడు. బంతిపై లాలాజలం ఉపయోగించేందుకు అనుమతిస్తే బౌలర్లకు కొంత సహాయం లభిస్తుందని అభిప్రాయపడ్డాడు.

ఇవి కూడా చదవండి

2020లో నిషేధం.. 2022లో శాశ్వతం

కరోనా మహమ్మారి సమయంలో ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 2020లో ఐసీసీ బంతిపై లాలాజలం ఉపయోగించడాన్ని తాత్కాలికంగా నిషేధించింది. ఆ తర్వాత 2022 అక్టోబర్ 1 నుంచి ఈ నిషేధాన్ని అంతర్జాతీయ క్రికెట్ ప్లేయింగ్ కండిషన్స్‌లో శాశ్వతంగా చేర్చింది. బంతిని మెరిపించేందుకు చెమటను ఉపయోగించేందుకు మాత్రం అనుమతి ఉంది. బంతి ఒక వైపు మెరుపును కొనసాగిస్తూ మరోవైపు సహజంగా అరిగేలా చేయడం వల్ల స్వింగ్, రివర్స్ స్వింగ్‌కు అవకాశం ఉంటుంది. అందుకే లాలాజలంపై నిషేధం బౌలర్లకు ఇబ్బందిగా మారుతోందన్న అభిప్రాయం కొందరు ఆటగాళ్లలో ఉంది.

 

లాలాజలంపై నిషేధం ఎందుకు కొనసాగిస్తోంది?

లాలాజలాన్ని ఉపయోగిస్తే బంతి పరిస్థితి గణనీయంగా మారే అవకాశం ఉందని ఐసీసీ భావిస్తోంది. ముఖ్యంగా చ్యూయింగ్ గమ్, మింట్స్, ఇతర తీపి పదార్థాలు తీసుకున్న తర్వాత లాలాజలంలో మార్పులు రావచ్చు. వాటిని బంతిపై ఉపయోగిస్తే బంతి మెరుపుపై ప్రభావం పడే అవకాశం ఉంది. అంతేకాదు, ఆటగాళ్లు లాలాజలాన్ని ఎలా ఉపయోగిస్తున్నారో పర్యవేక్షించడం, నియంత్రించడం కష్టమని ఐసీసీ అభిప్రాయం. ఆటగాళ్లు, అంపైర్ల ఆరోగ్య భద్రత కూడా మరో కారణంగా చెబుతోంది. అందుకే కరోనా ప్రభావం తగ్గినా ఈ నిబంధనను కొనసాగిస్తోంది.

ఎక్కువమంది చదివినది: IND vs PAK: తిలక్ కాదు.. టీమిండియా ఓటమికి ఈ ముగ్గురు అసలైన విలన్లు..!

అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనే ఎందుకు నిషేధం

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఐపీఎల్‌లో మాత్రం 2025 సీజన్ నుంచే బంతిని మెరిపించేందుకు లాలాజలం ఉపయోగించేందుకు బీసీసీఐ అనుమతించింది. పది జట్ల కెప్టెన్లతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది ఐపీఎల్‌కు మాత్రమే వర్తిస్తుంది. అంతర్జాతీయ టెస్టులు, వన్డేలు, టీ20ల్లో ఐసీసీ నిబంధనే అమల్లో ఉంటుంది. ఈ నెల ప్రారంభంలో బాలి వేదికగా జరిగిన ఐసీసీ సమావేశాల్లో కూడా లాలాజలం నిషేధంపై చర్చ జరగలేదని సమాచారం. భవిష్యత్తులో ఈ నిబంధనను మార్చాలంటే ఐసీసీ సంబంధిత కమిటీ ద్వారా ప్రతిపాదన రావాలి. చివరగా ఐసీసీ బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి గిల్ విజ్ఞప్తితో నిషేధం తొలగే పరిస్థితి కనిపించడం లేదు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us