BCCI Chief Selector: అగార్కర్ పదవి ఊడిపోతోందా? బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ కావాలంటే ఉండాల్సిన అర్హతలు ఇవే

BCCI Chief Selector: అజిత్ అగార్కర్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఎంపికపై ఆసక్తి నెలకొంది. ఈ కీలక పదవికి కనీసం 7 టెస్టులు, 10 వన్డేలు, 20 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు లేదా 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల అనుభవం, రిటైర్మెంట్ తర్వాత ఐదేళ్ల విరామం వంటి అర్హతలు తప్పనిసరిగా ఉండాలి.

BCCI Chief Selector: అగార్కర్ పదవి ఊడిపోతోందా? బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ కావాలంటే ఉండాల్సిన అర్హతలు ఇవే
Ajit Agarkar

Updated on: Sep 04, 2026 | 3:35 PM

BCCI Chief Selector: భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ముగింపునకు రావడంతో ఈ హాట్ సీట్ గురించి ప్రస్తుతం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. అగార్కర్ తొలగింపుపై రకరకాల ప్రచారాలు జరుగుతున్న వేళ అసలు టీమిండియా సెలెక్షన్ కమిటీ బాస్ కావడం ఎలాగో, దానికి ఉండాల్సిన అర్హతలేంటో స్పష్టంగా తెలుసుకుందాం. ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ముగుస్తుండటంతో క్రికెట్ ప్రపంచంలో అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన బీసీసీఐ రివ్యూ మీటింగులో అగార్కర్ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కార్యదర్శి దేవ్ జీత్ సైకియా తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న తొలగింపు వార్తలను బీసీసీఐ ఇంకా ధృవీకరించలేదు. 2027 వన్డే వరల్డ్ కప్ మరో ఏడాది మాత్రమే దూరంలో ఉండటంతో జట్టును ఎంపిక చేసే ప్రధాన ఎంపికదారుని పాత్ర అత్యంత కీలకంగా మారింది.

చీఫ్ సెలెక్టర్ కావాలంటే ఉండాల్సిన కనీస అర్హతలు

టీమిండియాను ఎంపిక చేసే సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ కావడానికి బీసీసీఐ కొన్ని కఠిన నిబంధనలను రూపొందించింది. ఎవరైనా ఈ పదవికి దరఖాస్తు చేసుకోవాలంటే కొన్ని ప్రాథమిక అర్హతలు తప్పనిసరి.

* అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుని కనీసం 5 సంవత్సరాలు పూర్టై ఉండాలి.

* కనీసం 7 టెస్టు మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండాలి.

* కనీసం 10 వన్డేలు, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి లేదా మొత్తంగా 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం కలిగి ఉండాలి.

* దరఖాస్తుదారు బీసీసీఐ కింద ఉన్న ఏ ఇతర కమిటీలోనూ మొత్తంగా 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం సభ్యుడిగా ఉండి ఉండకూడదు.

అజిత్ అగార్కర్ ట్రాక్ రికార్డ్ ఇదే

ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ 2013 అక్టోబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. రిటైర్ అయిన పదేళ్ల తర్వాత 2023లో బీసీసీఐ ఆయనను చీఫ్ సెలెక్టర్‌గా నియమించింది. టీమిండియా తరఫున 191 వన్డేలాడి 288 వికెట్లు పడగొట్టడమే కాకుండా 1269 పరుగులు చేశారు. 26 టెస్టుల్లో 58 వికెట్లు, 4 టీ20లు ఆడిన అనుభవం అగార్కర్‌కు ఉంది. బిసిసిఐ నియమ నిబంధనలకు సంపూర్ణంగా సరిపోవడంతోనే ఆయనకు ఈ బాధ్యతలు దక్కాయి.

చరిత్రలో పదిమంది దిగ్గజాలు

భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం 10 మంది మాత్రమే చీఫ్ సెలెక్టర్ పదవిని అలంకరించారు. అగార్కర్‌కు ముందు చేతన్ శర్మ 2022-23 వరకు ఈ పదవిలో కొనసాగగా, మధ్యలో శివ సుందర్ దాస్ తాత్కాలిక బాధ్యతలు నిర్వర్తించారు. టీమిండియా భవిష్యత్తును నిర్ణయించే ఈ పదవి దక్కించుకోవడం మాజీ ఆటగాళ్లకు సైతం ఎంతో సవాలుతో కూడుకున్న వ్యవహారం.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us