GT vs CSK : ప్లేఆఫ్స్ లెక్కలు తేలే లాస్ట్ చాన్స్.. టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న చెన్నై

GT vs CSK : శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ లోని గుజరాత్ టైటాన్స్ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అధికారికంగా క్వాలిఫై అయిపోయింది. ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌లలో 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి టేబుల్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది.

GT vs CSK : ప్లేఆఫ్స్ లెక్కలు తేలే లాస్ట్ చాన్స్.. టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న చెన్నై
Gt Vs Csk

Updated on: May 21, 2026 | 7:22 PM

GT vs CSK : ఐపీఎల్ 2026లో లీగ్ స్టేజ్ ముగింపు దశకు చేరిన వేళ.. గురువారం రాత్రి ఒక హై-వోల్టేజ్ పోరుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికైంది. ఐపీఎల్ 66వ లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్లు తలపడుతున్నాయి. ఈ కీలక పోరులో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్‌ను మొదట బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. రెండు జట్లకు ఇదే చివరి లీగ్ మ్యాచ్ కావడంతో లీగ్‌లో తమ స్థానాలను పదిలం చేసుకోవడానికి సర్వశక్తులూ ఒడ్డనున్నాయి.

శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అధికారికంగా క్వాలిఫై అయిపోయింది. ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌లలో 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి టేబుల్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే, క్వాలిఫైయర్-1 ఆడి నేరుగా ఫైనల్‌కు వెళ్లేందుకు వీలుగా పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే గుజరాత్‌కు ఈ మ్యాచ్‌లో గెలవడం చాలా అవసరం. సొంత మైదానంలో జరుగుతున్న మ్యాచ్ కావడం, జోస్ బట్లర్, సాయి సుదర్శన్ వంటి పవర్‌ఫుల్ ప్లేయర్స్ ఫామ్‌లో ఉండటం గిల్ సేనకు కొండంత బలాన్ని ఇస్తోంది.

మరోవైపు, రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది. వరుసగా గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో సీఎస్‌కే నేరుగా ప్లేఆఫ్స్ చేరే సువర్ణావకాశాన్ని చేజేతులా పాడుచేసుకుంది. ప్రస్తుతం 13 మ్యాచ్‌లలో కేవలం 6 విజయాలు, 7 ఓటములతో ఉన్న చెన్నై.. ఈ మ్యాచ్‌లో భారీ రన్‌రేట్‌తో గెలిచినా కూడా ప్లేఆఫ్స్ బెర్త్ కోసం ఇతర జట్ల గెలుపోటములపై, నెట్ రన్‌రేట్ సమీకరణాలపై పూర్తిగా ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్ ఓడిపోతే చెన్నై జట్టు ఐపీఎల్ 2026 టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించాల్సి వస్తుంది.

రెండు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఇవే:

టాస్ ముగిసిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు తమ తుది జట్లను ప్రకటించారు. సంజు శాంసన్, జోస్ బట్లర్ వంటి స్టార్ల ఎంట్రీతో ఇరు జట్లు బలంగా కనిపిస్తున్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, మాథ్యూ షార్ట్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్.

గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, కగిసో రబాడ, అర్షద్ ఖాన్, మహ్మద్ సిరాజ్.

పరుగుల వరద ఖాయం

నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ రిపోర్ట్ ప్రకారం.. ఇది సాంప్రదాయకంగా బ్యాటింగ్‌కు స్వర్గధామం. ఇక్కడ జరిగిన గత మ్యాచ్‌లోనే ఇరు జట్లు కలిసి ఏకంగా 414 పరుగులు సాధించాయి. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం.. రాత్రి వేళల్లో వచ్చే మంచు ప్రభావమే. అయితే, ఇక్కడి పిచ్‌పై పేస్ బౌలర్లకు ఆరంభంలో మంచి స్వింగ్ లభిస్తుంది. అలాగే స్లో బాల్స్ వేసే బౌలర్ల బౌలింగ్‌లో పరుగులు చేయడం బ్యాటర్లకు కాస్త కష్టంగా మారుతుంది. ఏదేమైనా టాస్ గెలిచి చేజింగ్ ఎంచుకున్న చెన్నైకి పిచ్ కండిషన్స్ కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది.

Follow Us