Shapoor Zadran : విధి ఆడిన వింత నాటకం..ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న వరల్డ్ కప్ హీరో

Shapoor Zadran : 38 ఏళ్ల వయసున్న ఈ క్రికెట్ యోధుడు ఇప్పుడు ఆసుపత్రి బెడ్‌పై మృత్యువుతో పోరాడుతున్నారు. దేశం కోసం మైదానంలో ఎన్నో యుద్ధాలు గెలిచిన ఈ ఆటగాడు, ఇప్పుడు తన ప్రాణాలను కాపాడుకోవడానికి పోరాడటం క్రీడా ప్రపంచాన్ని తీవ్రంగా కలిచివేస్తోంది.

Shapoor Zadran : విధి ఆడిన వింత నాటకం..ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న వరల్డ్ కప్ హీరో
Shapoor Zadran

Updated on: Jan 16, 2026 | 10:59 AM

Shapoor Zadran : ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ చరిత్రలో ఒక వెలుగు వెలిగి, తన వేగవంతమైన బౌలింగ్‌తో ప్రపంచ బ్యాటర్లను వణికించిన స్టార్ పేసర్ షాపూర్ జద్రాన్ ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. 38 ఏళ్ల వయసున్న ఈ క్రికెట్ యోధుడు ఇప్పుడు ఆసుపత్రి బెడ్‌పై మృత్యువుతో పోరాడుతున్నారు. దేశం కోసం మైదానంలో ఎన్నో యుద్ధాలు గెలిచిన ఈ ఆటగాడు, ఇప్పుడు తన ప్రాణాలను కాపాడుకోవడానికి పోరాడటం క్రీడా ప్రపంచాన్ని తీవ్రంగా కలిచివేస్తోంది. యుద్ధం, కష్టాల మధ్య ఎదుగుతున్న ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌కు ఒక గుర్తింపు తెచ్చిన వారిలో షాపూర్ జద్రాన్ ఒకరు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జనవరి 12, 2026న ఆయన సోదరుడు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. షాపూర్ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని అభిమానులందరూ ప్రార్థించాలని కోరారు. వైద్య వర్గాల సమాచారం ప్రకారం, ఆయన శరీరంలో తెల్ల రక్త కణాలు భారీగా పడిపోయాయని, దీనివల్ల ఆయన పరిస్థితి అత్యంత సున్నితంగా మారిందని తెలుస్తోంది.

2009లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన షాపూర్, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు. పదేళ్ల పాటు సాగిన ఆయన కెరీర్‌లో 44 వన్డేలు, 36 టీ20లు ఆడి మొత్తం 80 వికెట్లు పడగొట్టారు. 2015 వన్డే ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌పై ఆఫ్ఘనిస్తాన్ చారిత్రాత్మక విజయం సాధించినప్పుడు షాపూర్ జద్రాన్ హీరోగా నిలిచారు. ఆ మ్యాచ్‌లో బౌలింగ్‌లో రాణించడమే కాకుండా, చివరిలో బ్యాటింగ్‌కు వచ్చి విన్నింగ్ షాట్ కొట్టి జట్టుకు మొదటి వరల్డ్ కప్ విజయాన్ని అందించారు. ఆ విజయం తర్వాత ఆయన మైదానంలో జరిపిన సంబరాలు ఇప్పటికీ అభిమానుల కళ్లముందే కదలాడుతుంటాయి.

షాపూర్ అనారోగ్య వార్త తెలిసిన వెంటనే పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్‌తో పాటు అనేక మంది మాజీ క్రికెటర్లు, అభిమానులు స్పందించారు. “మైదానంలో సింహంలా పోరాడే షాపూర్, ఇప్పుడు జీవితంతో పోరాడుతున్నాడు. ఆయనకు మన ప్రార్థనలు అవసరం” అంటూ లతీఫ్ ట్వీట్ చేశారు. 2025లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన షాపూర్, ఇప్పుడు ఇంతటి అనారోగ్యానికి గురవ్వడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..