
England Domestic Cricket Cheating Controversy: క్రికెట్‌లో రకరకాల మోసాలు మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ఓ వింత ఘటన ఇప్పుడు క్రీడా లోకాన్ని నివ్వెరపరుస్తోంది. బంతి బ్యాట్‌కు ఏమాత్రం తగలకపోయినా స్లిప్‌లో ఉన్న ఓ ఫీల్డర్ చిటికె వేసి, ఆ శబ్దంతో అంపైర్‌ను బోల్తా కొట్టించాడు. అన్యాయంగా బ్యాటర్‌ను బలిచేసిన ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది.
క్రీడా స్ఫూర్తికి మారుపేరుగా నిలిచే జెంటిల్‌మెన్ గేమ్‌లో ఇలాంటి దిగజారుడు తనం బహుశా ఎవరూ ఊహించి ఉండరు. ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్ టోర్నీలో మైదానం సాక్షిగా కళ్లు చెదిరే మోసం వెలుగుచూసింది. సెకండ్ ఎలెవన్ డివిజన్ 2 లీగ్‌లో భాగంగా సాల్ట్‌బర్న్, నార్టన్ జట్ల మధ్య ఓ కీలక పోరు జరిగింది. ఈ మ్యాచ్‌లో సాల్ట్‌బర్న్ జట్టు ఆటగాళ్లు చేసిన ఓ నీచమైన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వికెట్ తీయడం కోసం బౌలర్ కష్టపడాలి, లేదంటే ఫీల్డర్లు అద్భుతమైన డైవ్ చేసి క్యాచ్ పట్టాలి. ఆ రెండు చేతకాని సాల్ట్‌బర్న్ ఆటగాళ్లు ఏకంగా అంపైర్‌నే గుడ్డివాడిని చేసే కుట్ర పన్నారు. గెలుపు కోసం ఏ అడ్డదారైనా తొక్కొచ్చన్న వారి కుసంస్కారం కెమెరాలకు అడ్డంగా దొరికిపోయింది.
నార్టన్ జట్టు బ్యాటర్ నోమాన్ షబ్బీర్ క్రీజులో ఉన్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. బౌలర్ వేసిన బంతి షబ్బీర్ బ్యాట్‌కు అతి సమీపం నుంచి వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్ళింది. బంతి బ్యాట్‌కు తగల్లేదు, కనీసం ఆ దరిదాపుల్లో కూడా లేదు. సరిగ్గా అదే సమయంలో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సాల్ట్‌బర్న్ ఆటగాడు తన రెండు వేళ్లతో గట్టిగా చిటికె వేశాడు. ఆ చిటికె నుంచి వచ్చిన శబ్దం అచ్చం బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకున్నప్పుడు వచ్చే సౌండ్‌లాగే వినిపించింది. అంపైర్ కళ్లుగప్పడానికి స్లిప్ ఫీల్డర్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ చూసి నెటిజన్లు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. ఫీల్డర్ సౌండ్ చేయగానే, వెంటనే వికెట్ కీపర్ జోష్ బోవ్స్ క్యాచ్ పట్టుకుని అవుట్ కోసం గట్టిగా అప్పీల్ చేశాడు. చుట్టుపక్కల ఉన్న ఫీల్డర్లు అంతా కలిసి ఒక్కసారిగా అరుస్తూ అంపైర్‌పై ఒత్తిడి తెచ్చారు. ఆ శబ్దాన్ని నిజంగానే బ్యాట్ సౌండ్ అని భ్రమపడిన అంపైర్, వెంటనే వేలు పైకెత్తి నోమాన్ షబ్బీర్‌ను క్యాచ్ అవుట్‌గా ప్రకటించాడు. ఏమాత్రం తప్పు చేయని బ్యాటర్ నిస్సహాయంగా పెవిలియన్ వైపు వెళ్లడం అభిమానులను తీవ్రంగా కలచివేసింది.
One of their opposing batsman called the behaviour out as well. You can see the fatty at first slip (Brian Devine) click with his fingers covered @Saltburncc @NorthallertonCC https://t.co/5AUDaGEd4Z pic.twitter.com/mBbbe8vRJN
— Baz (@baz_2939) July 27, 2026
ఈ పక్కా ప్లాన్డ్ మోసానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. క్రీడాభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తూ సాల్ట్‌బర్న్ జట్టు తీరుపై మండిపడుతున్నారు. ఈ వివాదం కాస్తా ముదరడంతో నార్త్ యార్క్‌షైర్, సౌత్ డర్హామ్ క్రికెట్ లీగ్ యాజమాన్యం రంగంలోకి దిగింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌పై తమకు అధికారికంగా ఫిర్యాదు అందిందని బోర్డు ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై నిష్పాక్షికంగా పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నామని వారు ఒక ప్రకటనలో తెలిపారు. విచారణ పూర్తయ్యే వరకు ఈ వ్యవహారంపై ఎలాంటి అదనపు వ్యాఖ్యలు చేయబోమని తేల్చి చెప్పారు.
సాల్ట్‌బర్న్ జట్టు ఇలాంటి చీటింగ్‌లకు పాల్పడటం ఇదే తొలిసారి కాదని ప్రత్యర్థి జట్లు ఆరోపిస్తున్నాయి. మిడిల్స్‌బ్రో సెకండ్ ఎలెవన్ కెప్టెన్ రోరీ కొటెరిల్ ఈ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత నెలలో సాల్ట్‌బర్న్‌తో జరిగిన తమ మ్యాచ్‌లో కూడా సరిగ్గా ఇలాంటి మోసాలే రెండుసార్లు జరిగాయని అతను బాంబు పేల్చాడు. ఆ మ్యాచ్‌లో తమ జట్టు అన్యాయంగా 29 పరుగుల తేడాతో ఓడిపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకే తప్పును పదే పదే చేస్తున్న సాల్ట్‌బర్న్ ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక తాజా వివాదానికి కారణమైన మ్యాచ్‌లో సాల్ట్‌బర్న్ జట్టు ఏకంగా 159 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇలా మోసాలకు పాల్పడుతూ పాయింట్ల పట్టికలో 17 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..