
లేచామా.. మ్యాచ్ ఆడామా.. సెంచరీ చేశామా.. గత కొన్ని రోజులుగా దేవదూత్ పడిక్కల్ డైలీ రొటీన్ ఇదే. కర్ణాటక ఓపెనర్ పడిక్కల్ నాలుగు మ్యాచ్‌లలో మూడు సెంచరీలు సాధించాడు. ఈ సీజన్‌లో పడిక్కల్ జార్ఖండ్‌పై 118 బంతుల్లో 147 పరుగులు.. కేరళపై 137 బంతుల్లో 124 పరుగులు.. ఇప్పుడు పుదుచ్చేరిపై పడిక్కల్ 116 బంతుల్లో 113 పరుగులు చేశాడు.
దేవదత్ పడిక్కల్ ఎంత దురదృష్టవంతుడో అర్థం చేసుకునే ముందు.. అతడి లిస్ట్ A క్రికెట్ రికార్డును పరిశీలిద్దాం. ఈ ఆటగాడికి లిస్ట్ Aలో 36 ఇన్నింగ్స్‌లలో 12 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు సాధించాడు. అతడి బ్యాటింగ్ సగటు 82.56 కాగా.. మొత్తంగా 2477 పరుగులు చేశాడు. ఇంత అద్భుతమైన బ్యాటింగ్ చేసినప్పటికీ.. ఇంకా టీమిండియాలోకి అడుగుపెట్టలేదు. పడిక్కల్‌కు రెండు టెస్ట్‌లు, రెండు T20Iలలో మాత్రమే ఆడాడు. వన్డే క్రికెట్‌లో అవకాశం దక్కించుకోలేకపోయాడు.
వన్డే జట్టులో దేవదూత్ పడిక్కల్ రావడం చాలా కష్టం. తీవ్రమైన పోటీ నెలకొంది. యశస్వి జైస్వాల్‌కు కూడా ఓపెనర్‌గా అవకాశం లభించడం లేదు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసినప్పటికీ ఇషాన్ కిషన్ కూడా జట్టుకు దూరంగా ఉండటంతో.. ఇక పడిక్కల్ వంతు మరింత కష్టతరం అవుతోంది. అయితే, లిస్ట్ ఎ క్రికెట్‌లో పడిక్కల్ మంచి ప్రదర్శన ఇస్తే, సెలెక్టర్లు అతన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. అయితే ఈ ఆటగాడు 2027 ప్రపంచకప్ వరకు వన్డే జట్టులోకి వచ్చే అవకాశం లేదు. రోహిత్, విరాట్ లాంటి ఆటగాళ్ళు వన్డే ప్రపంచకప్ తర్వాత రిటైర్ కావచ్చు. అప్పుడే పడిక్కల్‌కు స్థానం దొరుకుతుంది.
విజయ్ హజారే ట్రోఫీ నాలుగో రౌండ్‌లో పుదుచ్చేరిపై పడిక్కల్ తన సెంచరీలో నాలుగు సిక్సర్లు, 10 ఫోర్లు కొట్టాడు. ఈ సీజన్‌లో విజయ్ హజారే ట్రోఫీలో పడిక్కల్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతను నాలుగు మ్యాచ్‌ల్లో 101.5 సగటు, 106 స్ట్రైక్ రేట్‌తో 406 పరుగులు చేశాడు.