
Conor Carroll world Record: అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యంకాని ఒక అసాధారణ ప్రపంచ రికార్డు నమోదైంది. క్రొయేషియా దేశానికి చెందిన 23 ఏళ్ల యువ ఓపెనర్ కానర్ కారోల్ మైదానంలో పరుగుల విధ్వంసం సృష్టించాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ, కేవలం తన మొదటి 3 ఇన్నింగ్స్‌ల్లోనే ఊహించని రీతిలో పరుగులు రాబట్టి విశ్వవిజేతగా నిలిచాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ యూరప్ సబ్ రీజినల్ క్వాలిఫైయర్ పోటీలు ప్రస్తుతం అభిమానులకు అసలైన మజాను అందిస్తున్నాయి. ఈ టోర్నీలోనే క్రొయేషియాకు చెందిన ఓపెనర్ కానర్ కారోల్ తన బ్యాటింగ్‌తో సునామీ సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ కెరీర్ ప్రారంభించిన తొలి 3 ఇన్నింగ్స్‌లలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అతను సరికొత్త చరిత్ర లిఖించాడు. ఈ 3 మ్యాచ్‌ల్లో కానర్ ఏకంగా 147.5 సగటుతో, 215.33 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 295 పరుగులు చేశఆడు. క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ దిగ్గజ బ్యాటర్ కూడా తన అరంగేట్రం తర్వాత ఈ స్థాయిలో విరుచుకుపడలేదు.
ఇది కూడా చదవండి: కావ్య మారన్, అనిరుధ్ పెళ్లి..? వీరిద్దరి ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే అవాక్కే..
కానర్ కారోల్ తన మొదటి 3 ఇన్నింగ్స్‌లలో కేవలం 137 బంతులను మాత్రమే ఎదుర్కొని ఈ 295 పరుగుల మైలురాయిని చేరుకోవడం విశేషం. ఇందులో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 150 పరుగులు. ఈ ప్రస్థానంలో అతను ప్రత్యర్థి బౌలర్ల బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ 21 ఫోర్లు, ఏకంగా 25 సిక్సర్లు బాదాడు. ఈ అద్భుత ప్రదర్శనతో అతను ఫ్రాన్స్ దేశానికి చెందిన గుస్తావ్ మెక్‌కాన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. గుస్తావ్ తన మొదటి మూడు అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్‌ల్లో 286 పరుగులు చేయగా, కానర్ ఇప్పుడు 295 పరుగులతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
మే 17, 2026 న ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌తో కానర్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఆ తొలి మ్యాచ్‌లోనే కేవలం 34 బంతుల్లో 71 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత స్విట్జర్లాండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో అసలైన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపిస్తూ కేవలం 72 బంతుల్లోనే 13 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 150 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు.
ఇది కూడా చదవండి: Video: తూచ్.. వాడిదసలు బౌలింగేనా.. స్టాండ్స్‌లో శివాలెత్తిన కావ్యపాప..
ఇక మే 20, 2026 న జెర్సీ జట్టుతో జరిగిన తన మూడో మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 31 బంతులు ఎదుర్కొన్న కానర్, 9 సిక్సర్లు, 3 ఫోర్ల సహాయంతో 74 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లు చేతులెత్తేసేలా చేశాడు. ఈ 3 ఇన్నింగ్స్‌ల విధ్వంసం చూసిన తర్వాత ప్రపంచ క్రికెట్ విశ్లేషకులు ఈ యువ ఆటగాడిని టీ20 ఫార్మాట్‌కు కాబోయే సూపర్ స్టార్ అని కొనియాడుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..