ఐసీసీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న అండర్ 19 మహిళల ప్రపంచకప్‌లో టీమిండియా అదరగొడుతోంది. దక్షిణాఫ్రికా వేదికగా తొలిసారిగా జరుగుతున్న ఈ వరల్డ్‌కప్ టోర్నమెంట్‌లో భారత అమ్మాయిలు టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచారు. శుక్రవారం (జనవరి 27) జరిగిన సెమీఫైనల్‌లో భారత అమ్మాయిలు న్యూజిలాండ్‌ను చిత్తు చిత్తుగా ఓడించి ఫైనల్‌కు చేరుకున్నారు. ఆదివారం (జనవరి 29) జరిగే టైటిల్ పోరులో ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది టీమిండియా. కాగా ఈ ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు ఫైనల్‌కు చేరుకోవడంలో స్పిన్నర్లు మన్నత్ కశ్యప్, అర్చనా దేవి, సోనమ్ యాదవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా అర్చనా దేవి గింగిరాలు తిరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తోంది. పిచ్‌తో సంబంధం లేకుండా వికెట్లు పడగొడుతూ టీమిండియా విజయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. కాగా యూపీలోని ఓ కుగ్రామంలో పుట్టిన అర్చనా దేవి ఇక్కడ వరకు రావడం వెనక ఎంతో కృషి దాగి ఉంది. కన్నీటి కష్టాలు ఉన్నాయి. అర్చన నాలుగేళ్ల వయసులోనే తండ్రి మరణించాడు. ఇక కొన్నేళ్లకే సోదరుడు కూడా పాము కాటుకు బలయ్యాడు. ఆ తర్వాత తల్లి చాలా కష్టపడి కుటుంబాన్ని పోషించింది. కొన్నిసార్లు పొలాల్లో పని చేసేది. కొన్నిసార్లు ఇంటింటికీ పాలు అమ్మేది. ఇక అర్చనను స్కూల్‌కి పంపేందుకు డబ్బులు లేకపోవడంతో ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివించింది.
ఈ ప్రభుత్వ పాఠశాలలోని పీటీ టీచర్ పూనమ్ గుప్తా అర్చన ప్రతిభను గుర్తించారు. ఆమె సహాయంతోనే ఇంటిని వదిలిపెట్టి క్రికెట్ ట్రైనింగ్ కోసం కాన్పూర్ అకాడమీకి వెళ్లింది. అక్కడ చదువుకుంటూనే క్రికెట్ శిక్షణ తీసుకుంది. తన ప్రతిభతో 2018లో ఉత్తర ప్రదేశ్ జట్టుకు అరంగేట్రం చేసింది. ఆతర్వాత కోచ్ కపిల్ దేవ్ పాండే శిక్షణలో ఛాలెంజర్స్ ట్రోఫీ వంటి ప్రధాన టోర్నమెంట్లలో సత్తా చాటింది. ముందు టీమిండియా- ఎ, ఆతర్వాత భారత జాతీయ జట్టులోకి అడుగుపెట్టింది. కాగా క్రికెట్‌లో అర్చనా దేవి ఎదుగుదల యువ క్రికెటర్లకు స్ఫూర్తిదాయకమని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతిభ ఉన్న వారికి సరైన సదుపాయాలు, సహకారం అందిస్తే ఆటల్లో అద్భుతాలు సృష్టిస్తారనేందుకు అర్చన ఒక చక్కటి ఉదాహరణ అని పొగుడుతున్నారు. అదే సమయంలో, వచ్చే నెలలో జరగనున్న మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో చాలా ఫ్రాంచైజీలు అర్చనను తీసుకోవాలని పట్టు బుడుతున్నాయి.
3-14 (4 overs)
Archana Devi gets a magnificent 3 wicket haul against Scotland??#CricketTwitter #U19T20WorldCup pic.twitter.com/4jErdBsFhi
— Female Cricket (@imfemalecricket) January 18, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి.