
Bowing Records : టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన, దాదాపు అసాధ్యమనుకునే ఘనత ఏదైనా ఉందంటే అది ఒకే ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి జట్టులోని 10కి 10 వికెట్లను ఒక్కడే పడగొట్టడం! 140 ఏళ్లకు పైబడిన టెస్ట్ క్రికెట్ సుదీర్ఘ ప్రయాణంలో ఈ చారిత్రాత్మక అద్భుతాన్ని సాధించిన బౌలర్లు కేవలం ముగ్గురంటే ముగ్గురే. ఇంగ్లాండ్ ఆఫ్-స్పిన్నర్ జిమ్ లేకర్, భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే, న్యూజిలాండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ మాత్రమే ఈ ‘ఆల్-టెన్’ క్లబ్‌లో సభ్యులుగా నిలిచారు.
1956లో జిమ్ లేకర్ వేసిన తొలి బీజం
ఈ చారిత్రాత్మక రికార్డుకు పునాది వేసింది ఇంగ్లాండ్ దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ జిమ్ లేకర్. 1956లో మాంచెస్టర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్ ఇన్నింగ్స్‌లో జిమ్ లేకర్ ఏకంగా 53 పరుగులు మాత్రమే ఇచ్చి 10 వికెట్లు కూల్చాడు. కోలిన్ మెక్‌డొనాల్డ్ (89) మినహా ఆసీస్ బ్యాటర్లు ఎవరూ ఆయన బౌలింగ్‌ను తట్టుకోలేకపోయారు. టెస్టుల్లో ఈ మైలురాయిని అందుకున్న ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా జిమ్ లేకర్ చరిత్ర సృష్టించాడు.
1999లో అనిల్ కుంబ్లే సృష్టించిన విధ్వంసం
జిమ్ లేకర్ రికార్డు నమోదు చేసిన 43 ఏళ్ల తర్వాత భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ఆ అద్భుతాన్ని పునరావృతం చేశారు. 1999లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో సాంప్రదాయ ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో కుంబ్లే విజృంభించారు. కేవలం 74 పరుగులు ఇచ్చి పాకిస్థాన్ జట్టులోని 10 వికెట్లను తన ఖాతాలోనే వేసుకుని, ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా, తొలి భారతీయ బౌలర్‌గా రికార్డులకెక్కారు.
2021లో ముంబై వేదికగా అజాజ్ పటేల్ అద్భుతం
ఆ తర్వాత 2021 డిసెంబర్‌లో న్యూజిలాండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ముంబై వేదికగా టీమిండియాపై తొలి ఇన్నింగ్స్‌లోనే 10 వికెట్లు పడగొట్టి ఈ ఎలైట్ క్లబ్‌లో చేరాడు. 47.5 ఓవర్ల పాటు సుదీర్ఘంగా బౌలింగ్ చేసి భారత్‌ను కట్టడి చేసిన అజాజ్, టెస్టుల్లో 10 వికెట్లు తీసిన తొలి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు. అలాగే న్యూజిలాండ్ తరఫున రిచర్డ్ హాడ్లీ (9/52) రికార్డును దాటి బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి