AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Expansion: 12 జట్లు, రూ.150 కోట్ల పర్స్‌.. ఐపీఎల్ 2028 విస్తరణపై బీసీసీఐ క్లారిటీ..!

IPL Expansion: ఐపీఎల్ 12 జట్ల టోర్నీగా మారనుందన్న ఊహాగానాలకు బీసీసీఐ తెరదించింది. 2028 సీజన్ నుంచి రెండు కొత్త జట్లు, జట్టు పర్స్ రూ.150 కోట్లకు పెంపు అంటూ వస్తున్న వార్తలను కార్యదర్శి దేవజిత్ సైకియా తోసిపుచ్చారు. బోర్డు దృష్టంతా 20వ ఎడిషన్‌ అయిన ఐపీఎల్ 2027పైనే ఉందని స్పష్టం చేశారు.

IPL Expansion: 12 జట్లు, రూ.150 కోట్ల పర్స్‌.. ఐపీఎల్ 2028 విస్తరణపై బీసీసీఐ క్లారిటీ..!
Ipl 2027
Venkata Chari
|

Updated on: Nov 12, 2026 | 1:56 PM

Share

IPL Expansion: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్‌గా ఎదిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ భవిష్యత్తుపై కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చకు బీసీసీఐ అధికారికంగా ముగింపు పలికింది. 2028 సీజన్ నుంచి ఐపీఎల్‌ను 10 జట్ల నుంచి 12 జట్లకు విస్తరించనున్నారన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా తేల్చి చెప్పారు. ఐపీఎల్ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని మరో విస్తరణ ఉంటుందని అభిమానులు, కొందరు విశ్లేషకులు ఆశించారు. మీడియాలో కూడా 2028 నుంచి 12 జట్ల ఫార్మాట్ ఖాయమన్నట్లు కథనాలు వెలువడ్డాయి. వాటన్నింటినీ సైకియా కొట్టిపారేశారు.

“2028లో ఐపీఎల్‌ను 12 జట్ల టోర్నీగా మార్చే అవకాశంపై మేము సరదాకు కూడా చర్చించలేదు. ప్రస్తుతం అది మా పరిధిలో లేదు. 2027 ఐపీఎల్‌పైనే మా దృష్టి ఉంది. అది 20వ ఎడిషన్ కానుంది. కాబట్టి అది పెద్ద ఈవెంట్ కానుంది. దాని గురించే ఆలోచిస్తున్నాం, దానికి ఆవల ఏదీ పరిశీలించడం లేదు. మీడియాలో వస్తున్న వార్తలన్నీ కొందరి ఫలవంతమైన ఊహల నుంచి పుట్టిన ఊహాగానాలే. వాటికి ఎలాంటి విశ్వసనీయత లేదు” అని ఆయన స్పష్టం చేశారు. అంటే బోర్డు ప్రస్తుత ప్రాధాన్యత 2027 సీజన్‌ను ఘనంగా నిర్వహించడమే తప్ప, లీగ్ నిర్మాణంలో మార్పులు కాదని తేలిపోయింది.

రూ.150 కోట్ల పర్స్ ప్రచారంపైనా కొట్టివేత..

మరో కీలక అంశం జట్టు పర్స్. 2028 సీజన్ కోసం 2027లో జరగనున్న మెగా వేలానికి ముందు పర్స్‌ను రూ.125 కోట్ల నుంచి రూ.150 కోట్లకు పెంచనున్నారని ప్రచారం జరిగింది. దీనిపైనా సైకియా క్లారిటీ ఇచ్చారు.

“శాలరీ పర్స్ పెంపుపై అలాంటిదేమీ లేదు. మెగా వేలం వచ్చే ఏడాది ఎప్పుడో జరుగుతుంది. ఈసారిది మెగా వేలం కాదు. డిసెంబర్ 16న జరగనున్న వేలం ఈ సైకిల్‌లో చివరి ఏడాదిది. ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం” అని ఆయన వివరించారు.

అంటే ఫ్రాంచైజీలు, ఆటగాళ్లు భారీ పర్స్ ఆశలు పెట్టుకోవడం తొందరపాటేనన్న సంకేతం ఇచ్చారు.

జూహీ చావ్లా సూచనపై నో కామెంట్..

ఇదిలా ఉండగా, కోల్‌కతా నైట్ రైడర్స్ సహ యజమాని జూహీ చావ్లా చేసిన సూచనపైనా సైకియాను ప్రశ్నించారు. ఐపీఎల్‌ను సంప్రదాయ ఏప్రిల్-మే విండోకు బదులు జనవరిలో నిర్వహించాలని ఆమె ఇటీవల సూచించారు. దీనిపై స్పందించడానికి సైకియా నిరాకరించారు.

“2027 ఐపీఎల్ నిర్వహణపైనే మా దృష్టి ఉంది, అది మార్చి 2027లో ప్రారంభం కానుంది. అంతే” అని ఆయన క్లుప్తంగా ముగించారు.

బీసీసీఐ వ్యూహం ఏంటి?

పైకి ఇది ఊహాగానాల ఖండనలా కనిపించినా, లోతుగా చూస్తే బీసీసీఐ ఆలోచన అర్థమవుతుంది. 20వ ఎడిషన్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించి, ఆ తర్వాతే విస్తరణ, పర్స్, షెడ్యూల్ వంటి సంస్కరణలపై నిర్ణయం తీసుకోవాలన్నది బోర్డు వ్యూహం. 10 జట్లతోనే షెడ్యూల్ భారం, ఆటగాళ్ల వర్క్‌లోడ్, విండో సమస్యలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో 12 జట్ల నిర్ణయం ఆర్థికంగా ఆకర్షణీయంగా ఉన్నా, నిర్వహణపరంగా సవాలే. అందుకే బోర్డు తొందరపడటం లేదు.

Follow Us