
T20 World Cup 2026 : భారత్, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే విషయంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తన పంతాన్ని వీడడం లేదు. జనవరి 22న (గురువారం) జరిగిన కీలక సమావేశంలో బీసీబీ అధికారులు, ఆటగాళ్లు, బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ పాల్గొని ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. భారత్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తమ జట్టును అక్కడికి పంపేది లేదని, అవసరమైతే టోర్నీని బహిష్కరిస్తామని వారు స్పష్టం చేశారు. ఐసీసీ తమ విజ్ఞప్తిని పట్టించుకోకుండా అన్యాయం చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు.
ఈ సమావేశం అనంతరం ఆసిఫ్ నజ్రుల్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఐసీసీ మాకు న్యాయం చేయలేదు. మేము ఎవరికీ తలవంచం. ఒకవేళ బంగ్లాదేశ్ వంటి ప్రధాన జట్టు ప్రపంచకప్ ఆడకపోతే దాని పరిణామాలు ఎలా ఉంటాయో అందరికీ అర్థం కావాలి. మా ఆటగాళ్ల ప్రాణాలను పణంగా పెట్టి మేము భారత్‌కు పంపలేము” అని ఆయన వ్యాఖ్యానించారు. ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తప్పించడం వెనుక ఉన్న కారణాలు తమ దేశ గౌరవానికి సంబంధించినవని, ఇలాంటి పరిస్థితుల్లో తమ ఆటగాళ్లకు భారత్‌లో భద్రత ఉంటుందని నమ్మలేమని బంగ్లాదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది.
ICC had denied us our request to shift our matches away from India. We are not sure about the status of world cricket. Its popularity is going down. They have locked away 200 million people. Cricket is going to the Olympics, but if a country like us is not going there, it is…
— ANI (@ANI) January 22, 2026
వాస్తవానికి ఐసీసీ ఈ విషయంలో ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. భారత్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లకు ఎలాంటి భద్రతా ముప్పు లేదని స్వతంత్ర భద్రతా సంస్థల నివేదికలు స్పష్టం చేశాయని, షెడ్యూల్‌ను మార్చే ప్రసక్తే లేదని ఐసీసీ ఓటింగ్ ద్వారా తేల్చిచెప్పింది. బంగ్లాదేశ్ కోరినట్లు వారి మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చడం కుదరదని, ఇది భవిష్యత్తులో చెడు సంప్రదాయాలకు దారితీస్తుందని ఐసీసీ భావిస్తోంది. బుధవారం నాటి ఓటింగ్‌లో 14 మంది సభ్యులు బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా ఓటు వేయడం గమనార్హం.
మరోవైపు టీమిండియాతో సత్సంబంధాలు లేని పాకిస్థాన్ కూడా ఈ విషయంలో బంగ్లాదేశ్‌కు సపోర్టుగా నిలిచింది. ఒకవేళ శ్రీలంకలో కుదరకపోతే బంగ్లా మ్యాచ్‌లకు తాము ఆతిథ్యం ఇస్తామని పీసీబీ ప్రతిపాదించింది. అయితే ఐసీసీ మాత్రం ఇప్పటికే స్కాట్లాండ్ జట్టును స్టాండ్‌బైలో ఉంచింది. గురువారం చివరి గడువు ముగిసేలోపు బంగ్లాదేశ్ రాతపూర్వక అంగీకారం తెలపకపోతే, ఆ జట్టును టోర్నీ నుంచి తొలగించి స్కాట్లాండ్‌ను గ్రూప్-సి లో చేర్చనున్నారు. మరి కొద్ది గంటల్లో బంగ్లాదేశ్ తన భవిష్యత్తును తానే నిర్ణయించుకోనుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..