
IND vs SL, Asia Cup 2023 Final: ఆసియా కప్ టోర్నీ చివరి దశకు చేరుకుంది. సూపర్ 4 రౌండ్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మీద విజయం సాధించిన భారత్, శ్రీలంక ఆసియా కప్ టైటిల్ పోరులో రేపు తలపడనున్నాయి. కొలంబో వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు ఆర్ ప్రేమదాస స్టేడియా ఆతిథ్యమివ్వనుంది. డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగిన శ్రీలంక.. ఎలా అయినా ఈ సారి కూడా టైటిల్ గెలిచి భారత్ రికార్డును సమం చేయాలనే యోచనలో ఉంది. అయితే 1984 నుంచి జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో 7 సార్లు విజేతగా నిలిచిన భారత్ మాత్రం తన లెక్కను మరింతగా పెంచుకోవాలని భావిస్తోంది. పైగా ఆసియా కప్ టోర్నీ ఫైనల్లో ఇప్పటికే ఇరు జట్లు 8 సార్లు పోటీపడగా.. భారత్ 5 సార్లు, లంక 3 సార్లు గెలిచింది. ఈ క్రమంలో భారత్‌పై గెలిచి ఆ లెక్కను కూడా సమం చేయాలని లంకేయుల ఆలోచన. అయితే భారత్, శ్రీలంక మధ్య టైటిల్ కోసం హోరాహోరీగా జరగబోతున్న ఈ మ్యాచ్‌కి నేనూ పోటీ అంటూ వరుణుడు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆగకుండా వర్షం పడి మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి..? భారత్, శ్రీలంక జట్టుల్లో ఎవరు విజేతగా నిలుస్తారు..?
కొలంబో వాతావరణ నివేదిక ప్రకారం.. భారత్ vs శ్రీలంక ఆసియా కప్ ఫైనల్ సమయంలో వర్షం పడేందుకు దాదాపు 72 శాతం అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వర్షం కారణంగా సెప్టెంబర్ 17న ఆట ఆడకుంటే మరుసరి రోజు అంటే సెప్టెంబర్ 18న ఆడేందుకు రిజర్ డేని ప్రకటించింది ఏసీసీ.
Sep 17 Weather Report
అయితే భారత్ vs శ్రీలంక ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌కి రిజర్వ్ డేగా ప్రకటించిన సెప్టెంబర్ 18న కూడా 81 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నాయని weather.com నివేదికలు చెబుతున్నాయి. మ్యాచ్ రోజు, రిజర్వ్ డే కూడా వర్షం పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మ్యాచ్ మొత్తానికి రద్దయితే విజేత ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు అందరినీ వెంటాడుతోంది. రెండు రోజుల్లోనూ మ్యాచ్ ఫలితం తేలకుంటే.. భారత్-శ్రీలంక ఆసియా కప్ 2023 టైటిల్ ఉమ్మడి విజేతగా నిలుస్తాయి. కాగా, ఇలా టైటిల్ పంచుకోవడం ఇదే తొలి సారి కాదు. చాంంపియన్స్ ట్రోఫీ 2002 ఫైనల్లో భారత్, శ్రీలంక తలపడగా.. ఆ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఇరు దేశాల జట్లను చాంంపియన్స్ ట్రోఫీ 2002 విజేతగా ప్రకటించారు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (కీపర్ కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
శ్రీలంక జట్టు: పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్(కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరనా.