Ajinkya Rahane : వరుస ఓటములు, ఫ్యాన్స్ ట్రోల్స్.. కేకేఆర్ కెప్టెన్సీ వివాదంపై మౌనం వీడిన అజింక్యా రహానే

Ajinkya Rahane : ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు ప్రయాణం అనుకున్నంత సాఫీగా సాగలేదు. మే 24న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించడంతో కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలు పూర్తిగా గల్లంతయ్యాయి.

Ajinkya Rahane : వరుస ఓటములు, ఫ్యాన్స్ ట్రోల్స్.. కేకేఆర్ కెప్టెన్సీ వివాదంపై మౌనం వీడిన అజింక్యా రహానే
Ajinkya Rahane

Updated on: May 25, 2026 | 11:29 AM

Ajinkya Rahane : ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు ప్రయాణం అనుకున్నంత సాఫీగా సాగలేదు. మే 24న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించడంతో కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలు పూర్తిగా గల్లంతయ్యాయి. పాయింట్ల పట్టికలో టాప్-4 లోకి వెళ్లాలనే కోల్‌కతా కల నెరవేరకపోవడానికి ఈ సీజన్ ఆరంభంలో ఎదురైన వరుస ఓటములే ప్రధాన కారణం. లీగ్ మొదట్లోనే జట్టు వరుసగా మ్యాచ్‌లు ఓడిపోవడంతో కెప్టెన్ అజింక్యా రహానే కెప్టెన్సీ సామర్థ్యంపై అభిమానులు, మాజీ ఆటగాళ్లు పెద్ద ఎత్తున ప్రశ్నలు లేవనెత్తారు. కేకేఆర్ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించిన తరుణంలో, రహానే తను భవిష్యత్తులో కెప్టెన్‌గా కొనసాగుతాడా లేదా అనే విషయంపై ఒక హింట్ ఇచ్చాడు.

ఈ సీజన్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో కోల్‌కతా ఘోర పరాజయం పాలైన తర్వాత రహానే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. జట్టు ప్రదర్శన సరిగ్గా లేనప్పుడు విమర్శలు రావడం సహజమేనని అతను అంగీకరించాడు. అయితే, వరుసగా 5 మ్యాచ్‌లు ఓడిపోయినప్పుడు జట్టులో తలెత్తిన సమస్యలను అధిగమించడానికి తాను ఎంతగానో శ్రమించానని చెప్పాడు. “క్రికెటర్లమైన మేము ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి అభిమానులే కారణం. బాగా ఆడినప్పుడు అభినందించే ఫ్యాన్స్, సరిగ్గా ఆడనప్పుడు విమర్శిస్తారు. ఇది ఆటలో ఒక భాగం. నేను ఎప్పుడూ పాజిటివ్ మైండ్‌సెట్‌తోనే క్రికెట్ ఆడతాను. నాకు క్యారెక్టర్ చాలా ముఖ్యం” అని రహానే స్పష్టం చేశాడు.

తమ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడే నిజమైన క్యారెక్టర్ బయటపడుతుందని, ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరికీ ఉంటుందని రహానే చెప్పుకొచ్చాడు. “వరుసగా 5-6 మ్యాచ్‌లు ఓడిపోయిన తర్వాత మనసు గతంలోకి లేదా భవిష్యత్తులోకి వెళ్లడం చాలా సహజం. కానీ ఆ సమయంలో ప్రస్తుతంలో జీవించడం ముఖ్యం. ఏ క్షణంలోనైనా పరిస్థితులు మారిపోవచ్చు. ఆ నమ్మకంతోనే మేము ముందడుగు వేశాం. కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది, విమర్శలను కూడా అంగీకరించాం” అని అతను అన్నాడు. సోషల్ మీడియాలో చాలా మంది ఫ్యాన్స్ తనను కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసినప్పటికీ, తాను మధ్యలోనే తలవంచే వ్యక్తిని కాదని, స్వచ్ఛందంగా కెప్టెన్సీని వదులుకునే ఉద్దేశం తనకు లేదని తేల్చిచెప్పాడు.

రహానేకు కోచ్ అభిషేక్ నాయర్, కేకేఆర్ మేనేజ్‌మెంట్‌తో మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, అతని కెప్టెన్సీ రికార్డు చాలా బలహీనంగా ఉంది. రహానే ఇప్పటివరకు కేకేఆర్ జట్టుకు 27 మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేయగా, కేవలం 10 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించాడు. అతని విన్ పర్సంటేజ్ కేవలం 37.03 శాతం మాత్రమే ఉంది. కనీసం 20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన కేకేఆర్ లీడర్లలో రహానేదే అత్యంత పేలవమైన రికార్డు. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్ కోసం కేకేఆర్ యాజమాన్యం కొత్త కెప్టెన్ కోసం వెతికే అవకాశం ఉందని, సీనియర్ ఆటగాడు సునీల్ నరైన్ లేదా వైస్ కెప్టెన్ రింకూ సింగ్‌కు బాధ్యతలు అప్పగించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని స్పోర్ట్స్ నిపుణులు భావిస్తున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us