
Abhishek Sharma : సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్ జట్టుకు కెప్టెన్సీ వహిస్తున్న లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాట్ నుంచి పరుగుల వర్షం కురుస్తోంది. అతని స్ట్రైక్ రేట్ చూసి ప్రత్యర్థి బౌలర్లు హడలెత్తిపోతున్నారు. తాజాగా సర్వీసెస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. ఈ ఒక్క ప్రదర్శనతోనే, అతను సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా సరికొత్త రికార్డును నెలకొల్పాడు.
సర్వీసెస్ బౌలర్లపై మెరుపు దాడి
సర్వీసెస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ కేవలం 34 బంతుల్లో 62 పరుగులు సాధించి మెరుపు దాడి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతని స్ట్రైక్ రేట్ 182 కంటే ఎక్కువగా నమోదైంది. ఈ విధ్వంసక ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లతో పాటు, అతను కొట్టిన కీలకమైన 3 సిక్సర్లే అతన్ని టోర్నమెంట్‌లో సిక్సర్ కింగ్‌గా నిలబెట్టాయి. అభిషేక్ శర్మ సర్వీసెస్ జట్టులోని 5 గురు బౌలర్లను ఎదుర్కొని అందరి బౌలింగ్‌లోనూ పరుగులు రాబట్టాడు. విశాల్ గౌర్ (7 బంతుల్లో 12 పరుగులు), ఎస్ఎం రాఠీ (4 బంతుల్లో 200 స్ట్రైక్ రేట్‌తో 8 పరుగులు), అదే పేరున్న బౌలర్ అభిషేక్ (8 బంతుల్లో 200 స్ట్రైక్ రేట్‌తో 16 పరుగులు) లాంటి బౌలర్లందరిపై అతను తన ప్రతాపాన్ని చూపాడు.
26 సిక్సర్లతో రికార్డు
అభిషేక్ శర్మ ఇప్పుడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ టోర్నమెంట్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన ఆయన మొత్తం 26 సిక్సర్లను బాదాడు. ఈ ఘనతతో అంతకుముందు 25 సిక్సర్లతో ముందున్న ఆయుష్ మ్హాత్రేను అభిషేక్ అధిగమించాడు. అంతేకాకుండా, 6 మ్యాచ్‌లలో 26 సిక్సర్లతో పాటు మొత్తం 304 పరుగులు చేసి, టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు 300 ప్లస్ పరుగులు చేసిన ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లలో అభిషేక్ శర్మ కూడా ఒకడు. అతని కంటే ముందు 325 పరుగులతో ఆయుష్ మ్హాత్రే కొనసాగుతున్నాడు.