న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ ఇటీవల అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. కెనడా గ్లోబల్ టీ20 లీగ్‌లో ఆడుతున్న అతను ఈ విషయాన్ని వెల్లడించాడు. అయితే రిటైర్మెంట్ ప్రకటించిన కివీస్ దిగ్గజం మెక్‌కలమ్ కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. ఐపీఎల్‌లోని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. అంతేకాకుండా కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లోని ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టుకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. దీనిలో ఆసక్తికర విషయం ఏంటంటే సైమన్ కటిచ్ స్థానంలోనే మెక్‌కలమ్ ఈ బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు కటిచ్ కేకేఆర్‌కు అసిస్టెంట్ కోచ్‌గా, ట్రిన్‌బాగో టీమ్‌కు హెడ్‌కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు.
ఐపీఎల్ తొలి సీజన్‌లో మెక్‌కలమ్ కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) తరఫున ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ తొలి మ్యాచ్‌లోనే అజేయంగా 158 పరుగులు బాది రికార్డు సృష్టించాడు. ఐదు సీజన్లలో కేకేఆర్ తరఫున ఆడిన అతడు 2009లో నాయకుడిగా జట్టును నడిపించాడు. ఇప్పుడు తిరిగి అదే జట్టుకు అస్టిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం విశేషం. మెక్‌కలమ్ 101 టెస్టుల్లో 6453 పరుగులు, 260 వన్డేల్లో 6083 పరుగులు సాధించాడు.