
Winter Hindu Pooja Vidhi Telugu: హిందూ ధర్మంలో దేవుడి పూజ అంటే కేవలం మంత్రాలు చదవడం, హారతి ఇవ్వడం, నైవేద్యం సమర్పించడం మాత్రమే కాదు. భగవంతుడిని కుటుంబ సభ్యుడిగా, చిన్నపిల్లాడిగా భావించి ప్రేమతో సేవ చేయడం కూడా భక్తిలో ఒక భాగం. అందుకే అనేక ఆలయాల్లో, ఇళ్లలో దేవుడికి చేసే సేవలో కాలానుగుణంగా మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా చలికాలం ప్రారంభమైన తర్వాత దేవుడి వస్త్రధారణ, స్నానం, నైవేద్యంలో ప్రత్యేక మార్పులు చేస్తారు. అసలు చలికాలంలో దేవుడికి ఉన్ని దుస్తులు ఎందుకు వేస్తారు? కోమలమైన వస్త్రాలతో పాటు రజాయిలు ఎందుకు కప్పుతారు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకుందాం.
హిందూ సంప్రదాయంలో భగవంతుడిని సజీవంగా భావించి సేవించడం ఎంతో విశిష్టమైన ఆచారం. ముఖ్యంగా బాలకృష్ణుడు, బాలరాముడి రూపాలను ఆరాధించే ఆలయాల్లో ఈ సంప్రదాయాన్ని భక్తిశ్రద్ధలతో పాటిస్తారు. మనం చలి నుంచి రక్షణ పొందేందుకు స్వెటర్లు, శాలువాలు, దుప్పట్లు ధరించినట్లే దేవుడికి కూడా వెచ్చని దుస్తులు అలంకరిస్తారు. ఈ సమయంలో దేవుడికి ఉన్ని స్వెటర్లు, మఖమల్ వస్త్రాలు, శాలువాలు, టోపీలు, రజాయిలు సమర్పిస్తారు. ఉదయం, సాయంత్రం వేర్వేరు వస్త్రాలతో అలంకరించడంతో పాటు రాత్రి పవళింపు సేవ సమయంలో వెచ్చని దుప్పట్లు కప్పుతారు. భగవంతుడిని తమ కుటుంబ సభ్యుడిగా భావించి ప్రేమతో చేసే ఈ సేవ భక్తుల సమర్పణ భావానికి ప్రతీకగా నిలుస్తుంది.
చలికాలంలో దేవుడికి చేసే స్నాన విధానంలోనూ కొన్ని మార్పులు ఉంటాయి. సాధారణంగా కొన్ని ఆలయాల్లో చల్లటి నీటికి బదులుగా గోరువెచ్చని నీటితో స్వామివారికి అభిషేకం లేదా స్నానం చేయిస్తారు. స్నానం పూర్తయిన వెంటనే వెచ్చని వస్త్రాలను అలంకరిస్తారు. ఇళ్లలో పూజించే దేవతా విగ్రహాల విషయంలోనూ భక్తులు ఇదే విధానాన్ని అనుసరిస్తుంటారు.
ఋతువులను బట్టి భగవంతుడికి సమర్పించే నైవేద్యాల్లోనూ మార్పులు చేయడం హిందూ సంప్రదాయంలో కనిపిస్తుంది. చలికాలంలో బెల్లం, నువ్వులు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, వేడి పాలు, ఖీర్, హల్వా వంటి పదార్థాలను ప్రత్యేకంగా తయారుచేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
ముఖ్యంగా బాలగోపాలుడికి కుంకుమపువ్వు కలిపిన పాలు, వెన్న, సుకామేవా, వేడి ఖీర్ వంటి పదార్థాలను నివేదిస్తారు. ఈ విధంగా కాలానికి అనుగుణంగా దేవుడికి వస్త్రాలు, స్నానం, ఆహారాన్ని మార్చడం వెనుక భక్తుల ప్రేమ, ఆప్యాయత, సేవాభావం దాగి ఉన్నాయి. భగవంతుడిని మనలో ఒకరిగా భావించి చేసే ప్రతి చిన్న సేవ కూడా భక్తిలోని గొప్పతనాన్ని చాటుతుందని ఈ సంప్రదాయం తెలియజేస్తుంది.
(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న ఆచారాలు, సంప్రదాయాలు వివిధ ప్రాంతాలు, ఆలయాల విశ్వాసాల ఆధారంగా మారవచ్చు. వీటిని ఆధ్యాత్మిక, సంప్రదాయ విశ్వాసాల కోణంలో మాత్రమే చూడాలి.)