
మనము గుడిలోకి అడుగు పెట్టగానే సాధారణంగా ముందుగా చేసే పని గంటను కొట్టడం. ఇది ఒక సంప్రదాయం మాత్రమే కాదు, దీని వెనుక ఆధ్యాత్మిక విశ్వాసాలు, పురాణ సూచనలు, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. చాలామందికి ఇది అలవాటుగా మారిపోయినా, “గంట ఎందుకు కొడతారు?” అనే ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానాలు ఉన్నాయి.
గుడిలో గంట కొట్టడానికి ఒక ప్రధాన కారణం మనం ఆలయంలోకి వచ్చామని దేవతలకు తెలియజేయడం అని చెబుతారు. భక్తి భావంతో గంట మోగించడం ద్వారా మన మనసు పూర్తిగా ప్రార్థనలో లీనమవుతుందని విశ్వాసం.
పురాణాల్లో, ముఖ్యంగా స్కంద పురాణంలో, గుడిలో గంట మోగించడం ద్వారా అనేక జన్మల పాపాలు తొలగిపోతాయని పేర్కొనబడింది. గంట ధ్వని పవిత్రతను పెంచి మనసును శుద్ధి చేస్తుందని భక్తులు నమ్ముతారు.
శాస్త్రీయంగా చూస్తే, గంట మోగించినప్పుడు ఏర్పడే శబ్ద తరంగాలు వాతావరణంలో వ్యాపించి ఒక ప్రత్యేకమైన కంపనాన్ని సృష్టిస్తాయి. ఈ కంపనలు మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని తగ్గించడంలో సహాయపడతాయని కొందరు భావిస్తారు. అలాగే మనసులో ఉన్న ఉద్విగ్నతను తగ్గించి, శాంతిని కలిగించే ప్రభావం గంట శబ్దానికి ఉందని చెబుతారు.
గంట శబ్దం ఒక లయబద్ధమైన ధ్వని కావడంతో మనసు దానిపై కేంద్రీకృతమవుతుంది. దీనివల్ల ఆలోచనలు కొంతసేపు నిలిచి, మనం ప్రార్థనలో మరింత లోతుగా మునిగిపోవడానికి అవకాశం కలుగుతుంది. అందుకే గంట మోగించడం ఒక రకమైన ధ్యాన ప్రారంభంగా కూడా భావించవచ్చు.
కొంతమంది భక్తులు గంట మోగించిన తరువాత తమ కోరికలను దేవునికి తెలియజేస్తారు. వారి విశ్వాసం ప్రకారం ఆ ప్రార్థనలు నేరుగా భగవంతుడికి చేరుతాయని భావిస్తారు.
ఇళ్లలో జరిగే పూజల్లో కూడా గంటను మోగించడం ఒక ముఖ్యమైన భాగం. ఇది ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించడమే కాకుండా మనసుకు ఆనందం, ప్రశాంతతను కలిగిస్తుంది. గుడిలో గంట కొట్టడం అనేది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు. అది భక్తి, శాస్త్రం, మనసు శాంతి.. కలిసిన ఒక ఆధ్యాత్మిక అనుభవం.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)