జగన్నాథ రథోత్సవాల్లో పాల్గొనడానికి దేశ, విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. రథం లాగడం కోసం భక్తులు పోటీపడతారు. రథం తాడును తాకినా చాలు అదే అదృష్టమని చెబుతారు. వందల జన్మల పాపాలు ఒక్కసారి కడిగివేయబడతాయని నమ్ముతారు. రథం, రథ చక్రం, తాడు ఇలా ఏ రథ భాగాన్ని తాకినా పాపాలు తొలగిపోతాయని.. పునర్జన్మ లభించదని విశ్వాసం. పురాతన సంప్రదాయం ప్రకారం.. ముప్పై మూడు కోట్ల మంది దేవతలు రథంలో రథోత్సవం సమయంలో అశీనులు అవుతారని విశ్వాసం. కనుక రథాన్ని అలాగే తాడును తాకడం ముప్పై మూడు కోట్ల మంది దేవతలను తాకడంతో సమానం అని భావిస్తారు.
అయితే జగన్నాథుడు రథయాత్ర ఇప్పుడు జరుగుతున్నట్లు మొదట్లో జరిగేది కాదు. సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితం వరకూ రథయాత్రను రెండు వేర్వేరు భాగాలుగా జరుపుకునేవారు. ఆ సమయంలో మూడు కాదు ఆరు రథాలను ఉపయోగించేవారు. ఆ సమయంలో జగన్నాథుడు, సుభద్ర, బల రాముడిని మూడు రథాల్లో ఉంచి పూరీ ఆలయం నుంచి గుండిచా ఆలయం వరకూ ఆ రథాలను తీసుకెళ్లారు. అయితే ఇలా అత్త ఇంటికి వెళ్లే దారిలో భారీ బలగుండి వాగు వచ్చేది. ఆలయం నుంచి మూడు రథాలను వాగు దగ్గరకు తీసుకుని వెళ్ళేవారు. ఆపై జగన్నాథుడు, బలభద్రుడు, సోదరి సుభద్ర విగ్రహాలను రథాల నుండి దించి ఆ విగ్రహాలను నది దాటడానికి మూడు పడవల్లోకి తీసుకెళ్ళేవారు. కాలువ దాటిన అనంతరం అవతలివైపు ఉన్న మూడు రథాలను అధిరోహించి గుండిచా గుడికి తీసుకెళ్ళేవారు. అయితే కలాక్రమంలో రాజా కేసరి నరసింహ పూరీ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ బలగుండి వాగులో మార్పులు తీసుకుని వచ్చారు. దీంతో అప్పటి నుండి రథయాత్ర మూడు రథాలలో జరుపుకోవడం మొదలైంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు