Ganesh Visarjan: గణపతి నిమజ్జనం, అనంత చతుర్దశి ఒకే రోజున ఎందుకు? అసలు కారణం ఇదే!

Anant Chaturdashi 2026 And Ganesh Immersion: 2026లో గణపతి నిమజ్జనం, అనంత చతుర్దశి సెప్టెంబర్ 25న ఒకే రోజున జరగనున్నాయి. అసలు ఈ రెండు పండుగలు ఒకే రోజున ఎందుకు వస్తాయి? గణపతి విసర్జనకు అనంత చతుర్దశికి ఉన్న సంబంధం ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి.

Ganesh Visarjan: గణపతి నిమజ్జనం, అనంత చతుర్దశి ఒకే రోజున ఎందుకు? అసలు కారణం ఇదే!
Anant Chaturdashi 2026 And Ganesh Immersion

Updated on: Sep 22, 2026 | 7:23 PM

Anant Chaturdashi 2026 And Ganesh Immersion: గణేష్ ఉత్సవాల సమయంలో ఇళ్లు, పండాల్‌లు గణపతి బప్పా భక్తితో కళకళలాడుతాయి. భాద్రపద శుక్ల చతుర్థి రోజున ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు.. సాధారణంగా అనంత చతుర్దశి రోజున గణపతి విసర్జనతో ముగుస్తాయి. 2026లో ప్రధాన గణపతి నిమజ్జనం సెప్టెంబర్ 25, శుక్రవారం జరగనుంది. అదే రోజున అనంత చతుర్దశిని కూడా జరుపుకోనున్నారు. దీంతో గణపతి విసర్జన, అనంత చతుర్దశి రెండూ ఒకే రోజున ఎందుకు వస్తాయి? ఈ రెండు పండుగలు ఒకటేనా? లేక వీటికి వేర్వేరు మతపరమైన ప్రాధాన్యత ఉందా? అనే సందేహం చాలామందికి కలుగుతుంది. వాస్తవానికి, ఈ రెండింటికీ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. గణపతి భక్తులు విఘ్నేశ్వరుడికి వీడ్కోలు పలికే రోజే.. విష్ణుమూర్తి అనంత స్వరూపాన్ని ఆరాధించే అనంత చతుర్దశి కూడా జరుగుతుంది.

అనంత చతుర్దశి అంటే ఏమిటి?

హిందూ పంచాంగం ప్రకారం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్దశి తిథిని అనంత చతుర్దశిగా పరిగణిస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువు యొక్క అనంత స్వరూపాన్ని పూజించే సంప్రదాయం ఉంది. మత విశ్వాసాల ప్రకారం అనంత స్వరూపం స్థిరత్వం, శ్రేయస్సు, సుఖసంతోషాలు, కష్టాల నుంచి రక్షణకు ప్రతీకగా భావిస్తారు. అనంత చతుర్దశి రోజున భక్తులు విష్ణుమూర్తిని పూజించడంతో పాటు అనంత సూత్రాన్ని ధరించే ఆచారాన్ని కూడా పాటిస్తారు. ఈ సూత్రానికి సాధారణంగా 14 ముడులు ఉంటాయి. ఈ 14 ముడులను అనంత స్వరూపానికి ప్రతీకగా భావిస్తూ భక్తులు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.

మరి ఇదే రోజున గణపతి విసర్జన ఎందుకు?

గణపతి విసర్జన, అనంత చతుర్దశి ఒకే రోజున రావడానికి ప్రధాన కారణం గణేష్ ఉత్సవాల కాలవ్యవధితో సంబంధం కలిగి ఉంటుంది. భాద్రపద శుక్ల చతుర్థి రోజున గణపతి ప్రతిష్ఠతో ప్రారంభమయ్యే 10 రోజుల ఉత్సవాలు.. చతుర్దశి రోజున ముగుస్తాయి. ఈ చతుర్దశినే అనంత చతుర్దశిగా పిలుస్తారు. అందుకే ప్రధాన గణపతి విసర్జన, అనంత చతుర్దశి ఒకే రోజున జరుగుతాయి.

ఇవి కూడా చదవండి

గణపతి విసర్జనకు సంబంధించి ఒక పౌరాణిక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పురాణ గాథల ప్రకారం, మహర్షి వేదవ్యాసుడు మహాభారతాన్ని గణేశుడికి చెప్పగా, గణేశుడు దానిని లిఖించారు. ఈ ప్రక్రియలో గణేశుడు 10 రోజుల పాటు నిరంతరంగా మహాభారతాన్ని రాశారని చెబుతారు. పదో రోజు ఆయన శరీర ఉష్ణోగ్రత పెరగడంతో వేదవ్యాసుడు ఆయనకు స్నానం చేయించారని, అనంతరం గణేశుడి శరీరం చల్లబడిందని పౌరాణిక విశ్వాసం. ఈ కారణంగాణే గణనాథుడి విగ్రహాలను జలాశయాలలో నిమజ్జనం చేయడం ఆచారంగా మారిందని చెబుతారు. ఈ కథతో గణపతి విసర్జనకు సంబంధం ఉందని కొన్ని సంప్రదాయాలు చెబుతున్నప్పటికీ, ఇది మతపరమైన విశ్వాసం, పౌరాణిక కథనం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

గణపతి విసర్జన, అనంత చతుర్దశి మధ్య తేడా ఏమిటి?

పేర్లు, ఆచారాలు వేర్వేరు అయినప్పటికీ ఈ రెండు సందర్భాలు ఒకే రోజున వస్తాయి.

  • గణపతి విసర్జన: గణేష్ చతుర్థి రోజున ప్రతిష్ఠించిన గణేశుడి విగ్రహానికి పూజలు నిర్వహించిన అనంతరం, సంప్రదాయం ప్రకారం నిమజ్జనం చేస్తారు. భక్తులు గణపతి బప్పాకు వీడ్కోలు పలుకుతూ.. వచ్చే ఏడాది మళ్లీ రావాలని ప్రార్థిస్తారు.
  • అనంత చతుర్దశి: ఈ రోజు శ్రీమహావిష్ణువు అనంత స్వరూపాన్ని ఆరాధించే పర్వదినంగా భావిస్తారు. భక్తులు విష్ణుమూర్తిని పూజించి, అనంత సూత్రాన్ని ధరించే సంప్రదాయాన్ని పాటిస్తారు. అంటే, గణపతి విసర్జన గణేశుడికి సంబంధించిన ఆచారం కాగా.. అనంత చతుర్దశి విష్ణుమూర్తి అనంత స్వరూపానికి అంకితమైన పర్వదినం.

ఈ రెండు పూజలకు సంబంధం ఏమిటి?

గణపతి విసర్జన, అనంత చతుర్దశి వేర్వేరు మతపరమైన ఆచారాలు. వీటికి ప్రత్యక్షంగా ఒకే పూజా విధానం లేదా ఒకే దేవతతో సంబంధం లేదు. అయితే గణేష్ ఉత్సవాలు భాద్రపద శుక్ల చతుర్థి నుంచి చతుర్దశి వరకు కొనసాగడం వల్ల.. వాటి ముగింపు రోజు అయిన చతుర్దశి అనంత చతుర్దశిగా కూడా వస్తుంది. అందువల్లే ఒకే రోజున రెండు ప్రత్యేక ఆధ్యాత్మిక సంప్రదాయాలు కనిపిస్తాయి. ఒకవైపు భక్తులు గణపతి బప్పాకు ఘనంగా వీడ్కోలు పలుకుతుంటే.. మరోవైపు శ్రీమహావిష్ణువు అనంత స్వరూపాన్ని పూజిస్తూ అనంత చతుర్దశిని ఆచరిస్తారు.

(Disclaimer: ఈ కథనంలోని వివరాలు హిందూ మత విశ్వాసాలు, పౌరాణిక కథనాలు, సంప్రదాయాల ఆధారంగా అందించబడ్డాయి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Loading...
Unable to load recommendations.
Follow Us