
భగవంతుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఖరీదైన పూజలు, విలువైన కానుకలు, భారీ నైవేద్యాలు సమర్పించాల్సిన అవసరం లేదని శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్పష్టం చేశారు. తనకు భక్తితో సమర్పించే ఒక చిన్న ఆకు(పత్రం), పువ్వు, పండు లేదా నీటిని కూడా తాను స్వీకరిస్తానని చెప్పారు. భగవద్గీతలోని తొమ్మిదో అధ్యాయం, 26వ శ్లోకం (9.26) భక్తి తత్వంలోని ఈ గొప్ప విషయాన్ని తెలియజేస్తుంది. అసలు ఈ శ్లోకం అర్థం ఏమిటి? భగవంతుడికి సమర్పించే కానుకల కంటే భక్తి ఎందుకు ముఖ్యమైనది? తెలుసుకుందాం.
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి |
తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః ||
భగవద్గీతలోని ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు భక్తికి ఇచ్చిన ప్రాధాన్యతను వివరించారు. ఎవరైనా సరే తనకు ఒక ఆకు(పత్రం), పువ్వు, పండు లేదా నీటిని స్వచ్ఛమైన మనసుతో, భక్తితో సమర్పిస్తే దానిని తాను సంతోషంగా స్వీకరిస్తానని చెబుతున్నారు పరమాత్ముడు.
భగవద్గీతలోని ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు భక్తులు సమర్పించే బంగారం, వజ్రాలు, ఆభరణాలు, ఖరీదైన కానుకల గురించి ప్రస్తావించలేదు. సాధారణంగా అందరికీ అందుబాటులో ఉండే ఆకు, పువ్వు, పండు, నీటిని మాత్రమే ప్రస్తావించారు. దీని వెనుక గొప్ప ఆధ్యాత్మిక సందేశం ఉంది. భగవంతుడిని ఆరాధించడానికి, ప్రసన్నం చేసుకోవడానికి ఖరీదైన కానుకలు సమర్పించాల్సిన అవసరం లేదు. మీరు సంపన్నులై ఉండాల్సిన అవసరం లేదు. భారీ ఖర్చుతో పూజలు చేయలేని వారు కూడా తమకు అందుబాటులో ఉన్న చిన్న వస్తువులతో భగవంతుడిని ఆరాధించవచ్చు. మీకు స్వచ్ఛమైన మనసు, భక్తితో సమర్పించే చిన్న కానుకలను కూడా భగవంతుడు ఎంతో ప్రేమతో స్వీకరిస్తారు.
ఇక్కడ ప్రధానమైనది మనం సమర్పించే వస్తువు విలువ కాదు. దానిని ఎంతటి భక్తితో, ఎంతటి స్వచ్ఛమైన మనసుతో సమర్పిస్తున్నామన్నదే ముఖ్యం. అందుకే చాలా మంది తమ ఇళ్లలో పూజా సమయంలో తులసి దళం, ఒక పువ్వు లేదా కొద్దిగా నీటిని భగవంతుడికి సమర్పిస్తారు.
హిందూ సంప్రదాయంలో వివిధ దేవతలకు ప్రత్యేకమైన పత్రాలు, పుష్పాలు సమర్పించే ఆచారం ఉంది. శ్రీమహావిష్ణువు, శ్రీకృష్ణుడికి తులసి దళాలను సమర్పిస్తారు. పరమశివుడికి బిల్వపత్రాలను సమర్పిస్తారు. వినాయకుడికి గరికను సమర్పించడం సంప్రదాయం. ఆంజనేయస్వామికి తమలపాకును సమర్పిస్తారు. ఈ సమర్పణల్లో వస్తువుల కంటే వాటిని సమర్పించే భక్తి, శ్రద్ధకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
శ్రీకృష్ణుడికి అత్యంత సన్నిహితుడైన బాల్యమిత్రుడు సుదాముడు (కుచేలుడు) పేద బ్రాహ్మణుడు. ఒకసారి తన మిత్రుడిని కలవడానికి ద్వారకకు వెళ్లినప్పుడు ఆయన తనతో పాటు అటుకుల మూటను తీసుకెళ్లాడు. అది చాలా చిన్న కానుక కావడంతో శ్రీకృష్ణుడికి ఇవ్వడానికి సుదాముడు సంకోచించాడు. కానీ శ్రీకృష్ణుడు ఎంతో ప్రేమతో ఆ అటుకులను స్వీకరించి ఆనందంగా తిన్నాడు. ఈ కథ భాగవత పురాణంలో కనిపిస్తుంది. భగవద్గీత 9.26లో శ్రీకృష్ణుడు చెప్పిన భక్తి సూత్రానికి కుచేలుడి కథ ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తుంది.
భగవద్గీత తొమ్మిదో అధ్యాయంలోని 27వ శ్లోకంలో కూడా శ్రీకృష్ణుడు భక్తి గురించి మరింత విస్తృతంగా వివరించారు. మనం చేసే ప్రతి పని, తినే ఆహారం, సమర్పించే కానుక, చేసే దానం, ఆచరించే తపస్సు అన్నింటినీ తనకు అర్పణగా భావించాలని సూచించారు. అంటే పూజా సమయంలోనే కాకుండా మన రోజువారీ జీవితంలో చేసే ప్రతి పనిని కూడా భగవంతుడికి అంకితం చేయాలన్నది ఈ శ్లోకంలోని అంతరార్థంగా ఉంది.
అందుకే..ప్రతిరోజూ ఉదయం పూజ సమయంలో ఒక పువ్వు, తులసి దళం లేదా కొద్దిగా నీటిని భగవంతుడికి సమర్పించవచ్చు. ప్రత్యేకమైన మంత్రాలు తెలియకపోయినా మనసులోని భావాన్ని మన భాషలోనే తెలియజేయవచ్చు. ఒకవేళ ప్రయాణంలో ఉండి పూజ చేయడానికి అవకాశం లేకపోయినా మనసులోనే భగవంతుడిని స్మరించుకుంటూ సమర్పణ భావనను కలిగి ఉంటే సరిపోతుంది. పూజ చేస్తున్నప్పుడు మనసు ఇతర ఆలోచనలతో నిండిపోకుండా, సమర్పించే వస్తువుపై, భగవంతుడిపై ఏకాగ్రత ఉంచడం ముఖ్యం.
మొత్తంగా భగవద్గీత 9.26 మనకు ఇచ్చే సందేశం ఒక్కటే. భగవంతుడిని చేరుకోవడానికి సంపద, హంగులు, ఆడంబరాలు అవసరం లేదు. స్వచ్ఛమైన హృదయం, నిజమైన భక్తి ఉంటే చాలు.