
కాల్చిన కంకులు, ఉడకబెట్టిన గింజలు, స్వీట్ కార్న్ చాట్ ఇలా రకరకాలుగా మక్కజొన్నను జనం ఎంతో ఇష్టంగా తింటుంటారు. రుచికి రుచి, శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో మొక్కజొన్న మేలైన ఆహారమే అయినప్పటికీ.. కొందరికి మాత్రం ఇది తీవ్ర అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు మొక్కజొన్నకు దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు.

మొక్కజొన్నలో సహజ సిద్ధమైన కార్బోహైడ్రేట్లు అధిక మొత్తంలో ఉంటాయి. వీటిని తిన్న వెంటనే శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరిగిపోతాయి. ఇది రక్తంలో షుగర్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగడానికి దారితీస్తుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు లేదా షుగర్ స్థాయిలు నియంత్రణలో లేనివారు మొక్కజొన్నను పరిమితంగా తీసుకోవాలి లేదా పూర్తిగా దూరం పెట్టాలి. అలాగే వీటిపై బటర్, ఉప్పు ఎక్కువగా జోడించి తినడం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు తీవ్రంగా ప్రభావితమవుతాయి.

జీర్ణ సమస్యలు, ఉబ్బరం: మొక్కజొన్నలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. సాధారణంగా ఫైబర్ జీర్ణక్రియకు మంచిదే అయినప్పటికీ, జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి ఇది ప్రతికూలంగా మారుతుంది. దీనివల్ల కడుపులో గ్యాస్, నొప్పి, కడుపు ఉబ్బరం, పొట్ట బరువుగా అనిపించడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే పచ్చిగా ఉన్నవి లేదా సరిగ్గా ఉడకని మొక్కజొన్నలు తింటే జీర్ణవ్యవస్థపై భారం పడి మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి. జీర్ణ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు, బరువు తగ్గాలనుకునే వారు మొక్కజొన్నను తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది.

అలెర్జీ లక్షణాలు ఉంటే జాగ్రత్త: కొందరి శరీర తత్వానికి మొక్కజొన్న అస్సలు పడదు. అలాంటి వారు వీటిని తిన్న వెంటనే చర్మంపై దద్దుర్లు, దురద, వాపు లేదా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు రావడం వంటి అలెర్జీ ప్రతిచర్యలు కనిపిస్తాయి. మొక్కజొన్న తిన్న తర్వాత ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

మితంగా తింటేనే మేలు: ఏ ఆహారమైనా అమితంగా తీసుకుంటే అనర్థమే. మొక్కజొన్నను అప్పుడప్పుడు మితంగా తీసుకుంటే మేలు జరుగుతుంది కానీ, ప్రతిరోజూ అధిక మోతాదులో తినడం వల్ల ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. ఇప్పటికే ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ క్రమం తప్పకుండా మందులు వాడుతున్న వారు, ఆహారంలో మొక్కజొన్నను చేర్చుకునే ముందు వైద్యుడి లేదా పోషకాహార నిపుణుడి సలహా తీసుకోవడం ఉత్తమం.