
రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల తీవ్రఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. విదర్భ, తెలంగాణ, రాయలసీమల మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు. దీని ప్రభావంతో బుధవారం (03-06-2026) గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

03 జూన్, బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, పోలవరం, కాకినాడ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42-44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40-42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే రేపు శ్రీకాకుళం 7, విజయనగరం 6, మన్యం 11 మండలాల్లో(24) తీవ్రవడగాల్పులు, 28 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు.

ఇదిలాఉంటే.. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో బుధవారం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం కూడా రాష్ట్రంలోని చాలా జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు రానున్న నాలుగు రోజులలో క్రమంగా రెండు నుండి నాలుగు డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది.

ఆకస్మికంగా ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, విద్యుత్ స్తంబాలు, హోర్డింగ్స్ క్రింద నిలబడొద్దని ఏపీరాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ, వాటికి వీలైనంత దూరంగా ఉండాలన్నారు.

ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు,మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.