
ఇల్లు శుభ్రం చేయడం: చీకటి పడిన తర్వాత చీపురితో ఇల్లు చిమ్మడం, చెత్తను బయట పడేయడం చేయకూడదు. దీనివల్ల ఇంట్లోని ఐశ్వర్యం బయటకు వెళ్ళిపోతుందని భావిస్తారు. అలాగే సూర్యాస్తమయం తర్వాత తల దువ్వుకోవడం, జుట్టు విరబోసుకోవడం, గోళ్ళు లేదా జుట్టు కత్తిరించడం వంటి పనులకు కూడా దూరంగా ఉండాలని పెద్దలు చెబుతున్నారు.

వస్తువుల కొనుగోలు, విక్రయాలు: సాయంత్రం వేళ ఇంట్లో ఉన్న పాలు, పెరుగును ఎవరికీ ఇవ్వకూడదు. పెరుగు శుక్ర గ్రహానికి సంకేతం కాబట్టి, దీనివల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు దూరమవుతాయి. అలాగే లక్ష్మీదేవి స్వరూపాలుగా భావించే ఉప్పు, పసుపు, చింతపండు వంటి వస్తువులను సాయంకాలం కొనకూడదు, ఎవరికీ అప్పుగా లేదా దానంగా ఇవ్వకూడదు. ఇలా చేస్తే అప్పుల సమస్యలు పెరుగుతాయి.

భోజనం, తలుపులు మూయడం: సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్య ఆహారం తీసుకోకూడదు. అలాగే లక్ష్మీదేవి ప్రవేశించే సమయం కాబట్టి ఇంటి ప్రధాన తలుపులను పూర్తిగా మూసి ఉంచకూడదు. అలాగే సాయంత్రం 6 గంటల తర్వాత ఇంటిని చీకటిగా ఉంచితే దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. కాబట్టి ఇల్లు ఎప్పుడూ వెలుతురుతో ఉండాలి. చీకటి పడిన తర్వాత బట్టలు ఉతకడం, ఇంటి ముందు బట్టలు ఆరేయడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. కాబట్టి ఈ పనులు అస్సలు చేయవద్దు

చెడు మాటలు, అబద్ధాలు: సాయంత్రం వేళల్లో తదాస్తు దేవతలు తిరుగుతుంటారు. కాబట్టి ఆ సమయంలో అబద్ధాలు ఆడటం, చెడు మాటలు మాట్లాడటం చేయకూడదు. డబ్బు ఉన్నా లేదని, ఆరోగ్యం బాగున్నా బాగాలేదని అనకూడదు, అలా అంటే అవి నిజమవుతాయని నమ్మకం.అలాగే సాయంత్రం పూట ఎవరికీ డబ్బును అప్పుగా ఇవ్వకూడదు. అలాగే సాయంత్రం వేళల్లో చెట్ల ఆకులను కోయకూడదు. ముఖ్యంగా తులసి దళాలను తెంపడం, తులసి చెట్టుకు నీళ్లు పోయడం చేయకూడదు.

కుట్టడం, గొడవలు: సాయంకాలం సూదితో బట్టలు కుట్టకూడదు. ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్లు ఏడవడం, గొడవలు పడటం వంటివి చేస్తే కష్టాలు ప్రారంభమవుతాయి. అలాగే ఇంటి గుమ్మానికి కట్టిన నిమ్మకాయలు, బూడిద గుమ్మడికాయలను సాయంత్రం పూట మార్చకూడదు. ఈ ధర్మశాస్త్రాలు పేర్కొంటున్న ఈ నియమాలను పాటించడం ద్వారా ప్రతికూల శక్తి దూరమై, ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యం సిద్ధిస్తుందని పెద్దలు చెబుతున్నారు.( Note: ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించిండం లేదు)