
సాధారణంగా ఒకప్పుడు టీ కొట్టు అంటే ఏదో ఒక చెట్టు కింద చిన్న పాక.. లేదా ఏదైనా హోటల్ లో ఒక మూల ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. టీ తాగడం అనేది ఒక ఎమోషన్ అయిపోయింది. అందుకే టీ స్టాల్స్ యజమానులు కేవలం టీ రుచిపైనే కాకుండా, తమ షాపు పేర్ల మీద కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.

తాజాగా ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో వెలుస్తున్న టీ స్టాల్స్ పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయివ్యాపారంలో పోటీ పెరగడంతో కస్టమర్లను ఆకర్షించేందుకు అద్దంకి టీ స్టాల్ యజమానులు సరికొత్త రూట్ ఎంచుకున్నారు. కేవలం బోర్డులు చూసి షాపు లోపలికి వెళ్లేలా వెరైటీ పేర్లను పెడుతున్నారు. ఆ పేర్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి..

బాబాయ్ టీ స్టాల్: ఫ్యామిలీ మెంబర్‌గా పిలిచే 'బాబాయ్' పేరుతో ఇక్కడ టీ స్టాల్ వెలిసింది. ఇక్కడ స్పెషల్ దార్జిలింగ్ టీ, స్పెషల్ రోస్టెడ్ కాఫీ ఫేమస్. మామ టీ కొట్టు: ఇదే మామ ఛాయ్ కి అడ్డా" అంటూ క్యాచీ స్లోగన్‌తో ఈ షాపు ఆకట్టుకుంటోంది. బెల్లం టీ నుంచి బూస్ట్ వరకు ఇక్కడ అన్నీ వెరైటీలే.

90 ML టీ & కాఫీ: సాధారణంగా 90 ML అంటే మందుబాబులకు గుర్తొచ్చే పదం. కానీ ఇక్కడ టీ ప్రియుల కోసం ఈ వెరైటీ పేరును పెట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. పేర్లు బాగున్నాయి.. టీలు కూడా అదిరిపోతున్నాయి.పేరు వెరైటీగా ఉంటే చాలు, కస్టమర్లు ఇట్టే ఆకర్షితులవుతారు. అద్దంకిలో అదే జరుగుతోంది.

బయట బోర్డులు చూడగానే ఏదో కొత్తగా అనిపించి లోపలికి వచ్చాం.. పేర్లు వినడానికి సరదాగా ఉన్నాయి.. రుచి కూడా చాలా బాగుంది అని స్థానిక కస్టమర్లు చెబుతున్నారు. మొత్తానికి వ్యాపారంలో రాణించాలంటే కేవలం క్వాలిటీ ఉంటే సరిపోదు, కాస్తంత క్రియేటివిటీ కూడా ఉండాలని అద్దంకి టీ స్టాల్ యజమానులు నిరూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వెరైటీ టీ కొట్ల ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.