
మేక్ ఇన్ ఇండియా నినాదంతో భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త విప్లవం మొదలైంది. బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్, తన అత్యాధునిక ఎలక్ట్రిక్ స్కూటీ టెసరాక్ట్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో ఇది యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది.

వేగం - పవర్: ఇందులో అమర్చిన 20 HP ఎలక్ట్రిక్ మోటార్ అద్భుతమైన శక్తిని అందిస్తుంది. కేవలం 2.9 సెకన్లలోనే 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా దీనిని మూడు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చారు.

టాప్ వేరియంట్ ద్వారా ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 261 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. రోజువారీ ప్రయాణాలకు, లాంగ్ రైడ్స్‌కు ఇది బెస్ట్ ఎంపిక. కేవలం 30 నిమిషాల్లో 80శాతం బ్యాటరీ నిండుతుంది. దీనివల్ల ఛార్జింగ్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. మొబైల్ ఫోన్ల కోసం వైర్‌లెస్ ఛార్జింగ్ సౌకర్యం, భద్రత కోసం ABS ను కూడా అందించారు.

స్మార్ట్ ఫీచర్లు: సాధారణ ఇ-బైక్స్ లా కాకుండా టెసరాక్ట్ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. బైక్ సీటును తెరవడానికి ఫిజికల్ కీ అవసరం లేదు. స్మార్ట్ కనెక్టివిటీ ద్వారా సులభంగా ఆపరేట్ చేయవచ్చు. సీటు కింద 34 లీటర్ల భారీ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. ఇది సామాను మోసుకెళ్లడానికి ఎంతో అనుకూలం. ఇరుకైన ప్రదేశాలలో కూడా సులభంగా పార్క్ చేసేందుకు వీలుగా పార్కింగ్ అసిస్టెంట్ ఫీచర్‌ను జోడించారు.

ధర - లభ్యత: ఇంతటి అత్యాధునిక సాంకేతికత కలిగిన ఈ వాహనం ధరను సామాన్యులకు అందుబాటులో ఉండేలా రూ. 1.2 లక్షల నుండి రూ. 1.45 లక్షల మధ్య నిర్ణయించారు. పెట్రోల్ ధరలు మండిపోతున్న తరుణంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి ఇది ఒక గొప్ప ప్రత్యామ్నాయం.