
కావలసిన పదార్థాలు: 3 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న నిమ్మకాయ సైజు అంత కడిగి నానబెట్టిన చింతపండు, 1 పెద్ద సైజు టమాటా, 4 నుండి 5 పచ్చిమిరపకాయలు, కచ్చాపచ్చాగా దంచిన 10 వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకు, అర టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 చిన్న ముక్క బెల్లం, ఒకటిన్నర లీటర్ల నీళ్లు, కొద్దిగా తాజా కొత్తిమీర తరుగు . తాలింపు కోసం: 2 టేబుల్ స్పూన్ల వంట నూనె, పావు టేబుల్ స్పూన్ ఆవాలు, 4 నుండి 5 ఎండు మిరపకాయలు ముక్కలు, చిటికెడు ఇంగువ

తయారీ విధానం: చిన్న నిమ్మకాయ సైజు చింతపండును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లలో నానబెట్టుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులను వేసి లో ఫ్లేమ్‌పై దోరగా వేయించాలి. నువ్వులు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మరో నిమిషం పాటు వేయించి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

స్టవ్‌పై ఒక గిన్నె పెట్టి నానబెట్టుకున్న చింతపండు రసం పోయాలి. ఇందులో పెద్ద టమాటా ముక్కలు, 4-5 పచ్చిమిర్చి చీలికలు, దంచిన 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అర టీస్పూన్ పసుపు, 2 రెమ్మల కరివేపాకు వేయాలి. ఇప్పుడు ఒకటిన్నర లీటర్ల నీళ్లు పోసి కలపాలి. స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి 8 నుండి 10 నిమిషాల పాటు టమాటా మెత్తబడేలా చారును బాగా మరగనివ్వాలి.

పక్క బర్నర్‌పై చిన్న పోపు గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ ఆవాలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 ఎండుమిర్చి ముక్కలు, చిటికెడు ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసి పోపును దోరగా వేయించాలి. ఈ వేడి తాలింపును మరుగుతున్న చారులో వేసి వెంటనే సువాసన ఆవిరైపోకుండా మూతపెట్టి 10 సెకన్లు ఉంచాలి.

10 సెకన్ల తర్వాత మూత తీసి.. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వులు-మిరియాల పొడిని వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇందులోనే 1 చిన్న బెల్లం ముక్క వేసి మూతపెట్టి.. మీడియం ఫ్లేమ్‌పై కేవలం 5 నిమిషాలు మాత్రమే మరగనివ్వాలి. ఎక్కువ సేపు మరిగిస్తే నువ్వుల జిడ్డు తేలిపోతుంది కాబట్టి 5 నిమిషాలు సరిపోతుంది. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, నోరూరించే ఘుమఘుమలాడే 'నువ్వుల చారు' సిద్ధం! వేడివేడి అన్నంలో కలుపుకుని తింటుంటే నువ్వుల కమ్మదనం, వెల్లుల్లి-మిరియాల ఘాటుతో గొంతుకు ఎంతో హాయిగా ఉండటమే కాకుండా.. చారును గ్లాసుల్లో పోసుకుని సూప్‌లాగా కూడా తాగేయవచ్చు!