
కావలసిన పదార్థాలు: రెండు కప్పులు వండి చల్లార్చిన అన్నం, అర లీటర్ ప్యాకెట్ తాజా గడ్డ పెరుగు, 4 నుండి 5 - సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు, 4 నుండి 5 - పొడవుగా చీల్చిన పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ గుండు మినప్పప్పు, 6 నుండి 8 జీడిపప్పు పలుకులు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 నుండి 3 ఎండుమిర్చి, పావు టీస్పూన్ ఇంగువ, కరివేపాకు, తాజా కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు మరియు తాలింపుకు సరిపడా నూనె.

పెరుగన్నం కలిపే విధానం: ముందుగా వేడి అన్నాన్ని పూర్తిగా చల్లార్చి, ఉండలు లేకుండా చేత్తో పొడిపొడిగా చేసుకోవాలి. అందులో అర లీటర్ తాజా చిక్కటి పెరుగు వేయాలి. తగినంత ఉప్పు మరియు కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ అన్నాన్ని బాగా పిసుకుతూ కలపాలి. పెరుగన్నం మరీ గట్టిగా లేదా మరీ పల్చగా ఉండకూడదు. కొద్దిసేపటికి అన్నం పెరుగును పీల్చుకుంటుంది కాబట్టి కాస్త జావలా, జిగటగా ఉండేలా కలుపుకోవాలి.

ఇప్పుడు సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను చేత్తో రెమ్మలు విడదీస్తూ ఈ అన్నంలో వేసి కలపాలి. కమ్మని తాలింపు పెట్టే విధానం: స్టవ్ మీద పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడిచేయాలి. నూనె వేడెక్కాక శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి.

ఇప్పుడు పొడవుగా చీల్చిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ పొడి మరియు పిడికెడు కరివేపాకు వేసి కమ్మని సువాసన వచ్చే వరకు లో ఫ్లేమ్‌లో వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. తాలింపు మరీ వేడిగా ఉన్నప్పుడు పెరుగులో వేస్తే పెరుగు విరిగిపోయే ప్రమాదం ఉంది.

కాబట్టి కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత పెరుగన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. చివరగా తాజా కొత్తిమీర చల్లుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పెరుగు తాలింపు అన్నం సిద్ధం! ప్రతి ముద్దలో పంటికి జీడిపప్పు, పప్పులు, ఉల్లిపాయలు తగులుతూ అమృతంలా ఉంటుంది!