
తీవ్ర వేసవిలో ఎయిర్ కండిషనర్ల వినియోగం భారీగా పెరుగుతున్న వేళ, పాత లేదా సెకండ్ హ్యాండ్ ఏసీల వాడకంపై నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ ధరకు లభిస్తున్నాయని చాలా మంది వాడిన లేదా రీఫర్బిష్డ్ ACలను కొనుగోలు చేస్తున్నప్పటికీ, సరైన తనిఖీలు లేకుండా వాటిని ఉపయోగించడం ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా అరిగిపోయిన భాగాలు, లోపభూయిష్ట వైరింగ్, గ్యాస్ లీకులు వంటి సమస్యలు అగ్నిప్రమాదాలకు కారణమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏసీ పేలుళ్లు లేదా మంటలు అంటుకోవడానికి ప్రధాన కారణాల్లో కంప్రెసర్ దెబ్బతినడం ఒకటి. కంప్రెసర్ అధిక ఒత్తిడికి గురైతే యంత్రం వేడెక్కి ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. అలాగే గ్యాస్‌ను తప్పుగా రీఫిల్ చేయడం లేదా నాసిరకం రిఫ్రిజెరెంట్ ఉపయోగించడం కూడా ప్రమాదకరమని టెక్నీషియన్లు చెబుతున్నారు.

ఇక పాత వైరింగ్, చౌక ప్లగ్‌లు, ఎక్స్‌టెన్షన్ కార్డులు షార్ట్ సర్క్యూట్‌కు దారి తీస్తాయి. ఫిల్టర్లు, కూలింగ్ కాయిల్స్ మురికిగా ఉన్నా ACపై అదనపు ఒత్తిడి పడుతుంది. దీనివల్ల విద్యుత్ వినియోగం పెరగడంతో పాటు యంత్రం అధిక వేడికి గురవుతుంది. గంటల తరబడి నిరంతరంగా AC నడపడం కూడా ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.

AC నుంచి కాలిన వాసన రావడం, పెద్ద శబ్దాలు వినిపించడం, MCB పదేపదే ట్రిప్ అవడం, ప్లగ్ దగ్గర స్పార్కులు కనిపించడం వంటి సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే AC ఆపేసి టెక్నీషియన్‌ను సంప్రదించాలని చెబుతున్నారు.

వేసవి ప్రారంభానికి ముందే పూర్తి సర్వీసింగ్ చేయించడం, ప్రతి నెల ఫిల్టర్లు శుభ్రం చేయడం, సరైన స్టెబిలైజర్ ఉపయోగించడం, నాణ్యమైన వైరింగ్ ఏర్పాటు చేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చౌక మరమ్మతుల కోసం అనుభవం లేని టెక్నీషియన్లను ఆశ్రయించవద్దని హెచ్చరిస్తున్నారు.