
ప్రస్తుతం ప్రతీఒక్కరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది తప్పనిసరిగా మారిపోయింది. ఇప్పటి టెక్నాలజీ యుగంలో ఇది ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. బిజీ లైఫ్‌లో ఫోన్ లేనిది ఏ పని జరగడం లేదు. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ ఉపయోగిస్తూనే ఉంటారు. దీంతో ఛార్జింగ్ పెట్టుకునే సమయం ఉండదు. దీంతో రాత్రిపూట ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఉదయం వరకు అలాగే ఉంచుతారు. ఇలా ఉంచడం వల్ల బ్యాటరీ పాడైపోతుందని చాలామంది భావిస్తారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

రాత్రంతా ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీ పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇంతకముందు ఉన్న ఫోన్లు అయతే పాడై పోయేవి. కానీ ఇప్పుడు వస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు చాలా స్మార్ట్‌గా ఉన్నాయి. మీ వద్ద ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ ఉంటే స్మార్ట్ బ్యాటరీ నిర్వహణ, ఆప్టిమైజ్డ్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బ్యాటరీ 80 శాతం ఛార్జ్ అవ్వగానే.. ఫోన్‌లోని సాంకేతికత ఛార్జింగ్ వేగాన్ని తగ్గిస్తుంది. దీంతో మీ ఫోన్‌ను రాత్రంతా ప్లగ్ చేసి ఉంచినా కూడా బ్యాటరీ పాడవదు. కానీ ఛార్జింగ్ చేసేటప్పుడు ఫోన్ వేడెక్కే అవకాశం ఉంటుంది. దీంతో దిండు లేదా దుప్పటి కింద పెట్టకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది.

ఇక ఇప్పుడు మార్కెట్లోకి ఫాస్ట్ ఛార్జర్లు వచ్చాయి. కానీ దీని వల్ల ఫోన్ త్వరగా వేడెక్కుతుంది. లిథియం అయాన్ బ్యాటరీలకు వేడి అనేది అతిపెద్ద శత్రువు. ఫాస్ట్ ఛార్జర్లు అధిక వాటేజ్ శక్తిని అందిస్తాయి. దీనివల్ల ఫోన్‌లోని అయాన్లు వేగంగా కదలడం వల్ల ఫోన్ వేడెక్కుతుంది. అధిక వేడి వల్ల బ్యాటరీ సామర్థ్యం క్రమంగా తగ్గుతుంది. సాధారణ ఛార్జర్‌తో పోలిస్తే ఫాస్ట్ ఛార్జర్ బ్యాటరీ లైఫ్‌లో ఒక శాతం కన్నా తక్కువ వ్యత్యాసాన్ని మాత్రమే కలిగిస్తుంది. దీంతో ఉదయం పూట ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగించడంలో ఎలాంటి నష్టం ఉండదు

ఫోన్ బ్యాటరీ ఎటువంటి సమస్యలు లేకుండా సంవత్సరాల పాటు పనిచేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫోన్ బ్యాటరీకి ఛార్జింగ్ 20 శాతం కంటే ఎక్కువగా, 80 శాతం కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. జీరో పర్సంటేజ్ ఛార్జింగ్‌తో ఫోన్‌ను ఎప్పుడూ పూర్తిగా డిశ్చార్జ్ కానివ్వకండి. జీరో పర్సంటేజ్ ఛార్జింగ్ అనేది బ్యాటరీకి అత్యంత హానికరమని టెక్ నిపుణులు చెబుతున్నారు.

ఇక రాత్రిపూట సాధారణ ఛార్జర్‌తో ఛార్జింగ్ పెట్టడం మంచిది. కేవలం అత్యవసర పరిస్థితుల్లో ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. దీంతో ఫోన్ బ్యాటరీ ఎక్కువ రోజులు రావాలంటే ఈ చిట్కాలు పాటించాలని టెక్ నిపుణులు చెబతున్నారు. రాత్రిపూట ఛార్జింగ్ పెట్టడం వల్ల ఇబ్బంది ఏం ఉండదు. కానీ సాధారణ ఛార్జర్ ఉపయోగించండి.