
మరికొన్ని గంటల్లో ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా సమరం మొదలు కానుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్, భారత్ జట్లు ముఖాముఖి తలబడనున్నాయి. ఇప్పటికే ఈ మ్యాచ్‌కు టీమిండియా 15 మంది సభ్యులను ఎంపిక చేయగా.. వారిలో తుది జట్టులో చోటు ఎవరు దక్కించుకున్నారో ఇప్పుడు చూద్దాం..

ఎక్స్‌పెరిమెంట్స్ జోలికి పోకుండా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మరోసారి తన పాత టీమ్‌పైనే నమ్మకం ఉంచాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌లతో పాటు ఇంగ్లాండ్ సిరీస్‌లో చక్కటి ప్రదర్శన కనబరిచిన అక్షర్ పటేల్‌కు కూడా నిరాశ మిగిలింది.

ఆ 15 మంది సభ్యులను చూస్తే.. సీనియర్లపై విరాట్ కోహ్లీ పూర్తి బాధ్యతను పెట్టినట్లు కనిపిస్తోంది. ఇంగ్లాండ్ పిచ్‌పై అనుభవం ఉన్న సీనియర్లతో పాటు ముగ్గురు యువ క్రికెటర్లను ఎంచుకున్నాడు.

రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్, పుజారా, కోహ్లీ, రహనే, విహారి, రిషబ్ పంత్, వృద్దిమాన్ సాహా, అశ్విన్, జడేజా, బుమ్రా, ఇషాంత్, షమీ, ఉమేష్ యాదవ్, సిరాజ్‌లు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు ఎంపికైన 15 మంది సభ్యులు కాగా.. వీరిలో ఉమేష్ యాదవ్, సిరాజ్, సాహా, విహారిలు తుది జట్టులో ఉండరని సమాచారం.

ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగుతుందని తెలుస్తోంది. దాన్ని బట్టి చూస్తే టీంలో.. రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్, పుజారా, కోహ్లీ, రహనే, రిషబ్ పంత్, అశ్విన్, జడేజా, బుమ్రా, ఇషాంత్, షమీలు ఉండే అవకాశం ఉంది.

అటు న్యూజిలాండ్ టీంలో - కాన్‌వే, లాథమ్, విలియమ్సన్, టేలర్, నికోలస్, జమీసన్, వాటలింగ్, సౌధి, బౌల్ట్, వేగ్నర్ ఉండనున్నారని సమాచారం.