
Garuda Purana: హిందూ ధర్మంలో గరుడ పురాణంకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. గరుడ పురాణం 18 మహాపురాణాలలో ఒక ముఖ్యమైన గ్రంథం. ఇది మనిషి జీవితాన్ని, మరణాన్ని, ఆత్మ ప్రయాణాన్ని (మరణం నుంచి మోక్షం వరకు) వివరిస్తుంది. అందువల్ల దీనికి నిత్యజీవితంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గరుడ పురాణం ప్రకారం, మరణం జీవితానికి అంతిమ సత్యం. ఎవ్వరూ దాన్ని తప్పించుకోలేరు. ఈ భూమిపై జన్మించిన ప్రతి ఒక్కరికీ మరణం అనివార్యం. అయితే, ఒక వ్యక్తికి మరణం సమీపించినప్పుడు కొన్ని సంకేతాలు కనిపిస్తాయని ఈ గ్రంథం చెబుతుంది. అవేంటో చూద్దాం..

1. నీడ కనిపించకపోవడం.. ఒక వ్యక్తికి తన నీడ కనిపించకపోతే అది అశుభ సూచనగా పరిగణించబడుతుంది. ఇది మరణం సమీపిస్తున్నదని సూచిస్తుంది. అలాంటి పరిస్థితిలో వ్యక్తి అప్రమత్తంగా ఉండాలని చెబుతారు.

2. పూర్వీకులు కనిపించడం.. ఒక వ్యక్తికి అకస్మాత్తుగా తన పూర్వీకులు దర్శనమివ్వడం ప్రారంభమైతే.. అది మరణానికి సంకేతంగా భావించబడుతుంది. ఇది యముడు త్వరలో పిలుస్తాడని సూచనగా చెబుతారు.

3. మృత్యుదూతల అనుభూతి.. మరణ సమయం దగ్గరపడే కొద్దీ.. కొంతమంది వ్యక్తులకు మృత్యుదూతలు కనిపిస్తున్నట్టు లేదా ఎవరో తమను తీసుకెళ్లడానికి వస్తున్నట్టు అనిపించవచ్చు. ఈ సమయంలో వారు ప్రతికూల శక్తులను కూడా అనుభవించవచ్చు.

4. గత కర్మల గుర్తింపు.. మరణం సమీపించినప్పుడు.. వ్యక్తి తన జీవితంలో చేసిన మంచి-చెడు పనులను గుర్తుచేసుకోవడం ప్రారంభిస్తాడని చెబుతారు. ఈ అనుభూతి కూడా మరణానికి సంకేతంగా భావించబడుతుంది.

5. అరచేతి గీతల్లో మార్పులు.. అరచేతిలోని గీతలు అకస్మాత్తుగా మసకబారడం లేదా కనిపించకపోవడం కూడా ఒక సూచనగా చెప్పబడింది. ఇది జీవితం ముగింపు దశకు చేరుకుంటున్న సంకేతంగా భావిస్తారు.

6. మృత్యుద్వారం దర్శనం.. కొంతమందికి మరణానికి కొద్దిసమయం ముందు ఒక విచిత్రమైన గుహ, ద్వారం లేదా వెలితి ప్రదేశం కనిపిస్తున్నట్టు అనిపించవచ్చు. దీన్ని "మృత్యుద్వారం"గా వర్ణిస్తారు. ఇది మరణం సమీపిస్తున్నదని సూచిస్తుంది. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)