
మేషం: ఈ రాశికి కుటుంబ, కళత్ర స్థానాధిపతి అయిన శుక్రుడు ఇదే రాశిలోనూ, ఆ తర్వాత కుటుంబ స్థానంలోనూ సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి జీవిత భాగస్వామి మీదా, పిల్లల మీదా ప్రేమ బాగా పెరిగే అవకాశం ఉంది. సమస్యలు, విభేదాలు, వివాదాలకు ప్రాధాన్యం బాగా తగ్గిపోతుంది. దాంపత్య జీవితం నిత్య కల్యాణం పచ్చతోరణంగా సాగిపోతుంది. అన్యోన్యత పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కోర్టు వివాదాలు దాదాపు పూర్తిగా సమసిపోతాయి.

వృషభం: రాశ్యధిపతి శుక్రుడే కళత్ర కారకుడైనందువల్ల దంపతుల ఆలోచనా ధోరణిలో బాగా మార్పు వచ్చి, కుటుంబ, దాంపత్య సమస్యలు వాటంతటవే పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వైవాహిక జీవితం చాలావరకు నిత్య కల్యాణం పచ్చ తోరణంలా సాగిపోతుంది. ఆదాయం బాగా పెరగడానికి, సొంత ఇల్లు ఏర్పడడానికి, సంతాన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. విహార యాత్రలు పెరుగుతాయి. కోర్టు వివాదాలు రాజీమార్గంలో పరిష్కారమవుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

కర్కాటకం: కళత్ర కారకుడైన శుక్రుడు దశమ, లాభ స్థానాల్లో సంచారం చేయడం వల్ల ఇద్దరి మధ్యా ఎటువంటి సమస్యలున్నా తొలగిపోయి అన్యోన్యత పెరగడం జరుగుతుంది. దాంపత్య జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. భార్యాభర్తలు తమ సమస్యల్ని పెద్దల తోడ్పాటుతో సామరస్యంగా పరిష్కరించుకోవడం జరుగుతుంది. జీతభత్యాలు పెరగడం, ఆదాయం వృద్ధి చెందడం, సంతాన ప్రాప్తికి అవకాశం ఉండడం వంటి కారణాల వల్ల ఇద్దరి మధ్యా ప్రధాన విభేదాలు సమసిపోతాయి.

కన్య: కళత్ర కారకుడు, కుటుంబ స్థానాధిపతి అయిన శుక్రుడు మరో నెలన్నర పాటు భాగ్య స్థానంలో సంచారం చేయడం వల్ల, దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో ముందుకు సాగిపోతుంది. విభే దాలు, వివాదాలు మటుమాయమవుతాయి. సమస్యలు పరిష్కారమవుతాయి. దంపతుల మధ్య విడదీయరాని సంబంధం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనడం జరుగుతుంది. అనారోగ్యాలకు అవకాశం ఉండకపోవచ్చు. విహారయాత్రలు ఎక్కువగా జరుగుతాయి.

మకరం: ప్రస్తుతం ఈ రాశివారికి మరో రెండు నెలల పాటు శుక్ర గ్రహం బాగా అనుకూలంగా ఉంది. దాంపత్య జీవితంతో పాటు కుటుంబ జీవితం కూడా హ్యాపీగా, సాఫీగా సాగిపోయే అవకాశం ఉంది. ఎటువంటి పొరపచ్చాలున్నా సమసిపోయే అవకాశం ఉంది. ఆర్థిక, ఆరోగ్య, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవడం వల్ల దంపతుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆదాయం వృద్ధి చెందడం, సొంత ఇల్లు, వాహనాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది.

కుంభం: ఈ రాశికి ప్రస్తుతం శుక్ర గ్రహం మూడు, నాలుగు స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల కుటుంబ, దాంపత్య జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. కోర్టు కేసుల్లో రాజీ జరిగి, ఇద్దరి మధ్యా మళ్లీ సఖ్యత ఏర్పడుతుంది. భార్యాభర్తల మనసుల్లోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరుతాయి. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగం, ఆదాయం వంటి విషయాల్లో ఇద్దరి మధ్యా అనుకూలతలు పెరుగుతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. విహార యాత్రలు ఎక్కువగా జరుగుతాయి.