
మొండి పట్టుదలకు, కఠిన క్రమశిక్షణకు మారుపేరైన శనీశ్వరుడితో ఈ నెల (జూలై) 7, 8, 9 తేదీల్లో చంద్రుడు మీన రాశిలో యుతి చెందడం జరుగుతోంది. కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి, కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి ఇవి మంచి రోజులు. ఈ శని, చంద్రుల మీద గురువు దృష్టి కూడా పడడం వల్ల ఏ పని చేపట్టినా అనుకున్నది అనుకున్నట్టు పూర్తవుతుంది. ఆదాయం, ఉద్యోగం, పెళ్లి, బదిలీ, పోటీ పరీక్షలు, కోర్టు కేసులు, వివాదాల్లో విజ యాలు సాధించడానికి అవకాశం ఉంది. వృషభం, మిథునం, కర్కాటకం, వృశ్చికం, మకరం, మీన రాశులవారు సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో శని, చంద్రుల యుతి వల్ల కొద్ది ప్రయత్నంతో మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధించిన ఆశిం చిన ఉద్యోగం పొందుతారు. రకరకాలు ప్రయోగాలు, ప్రయత్నాలతో వృత్తి, వ్యాపారాలను కొత్త పుంతలు తొక్కిస్తారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరించుకుంటారు.. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది.

మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో శని, చంద్రుల కలయిక వల్ల విదేశాల్లో ఉద్యోగాలకు ప్రయత్నించేందుకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో పదోన్నతికి ప్రయత్నించడం మంచిది. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల్లో సరైన ప్రయత్నాలు, నిర్ణయాలతో ఆశించిన లాభాలు పొందుతారు. మంచి పరిచయాలు కలుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కర్కాటకం: ఈ రాశికి భాగ్యస్థానంలో రాశ్యధిపతి చంద్రుడు శనీశ్వరుడిని కలవడం వల్ల ఆదాయ వృద్ధి ప్రయత్నాలు అంచనాలకు మించిన ఫలితాలనిస్తాయి. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు కలుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.

వృశ్చికం: ఈ రాశికి పంచమ స్థానంలో శని, చంద్రుల కలయిక వల్ల కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారికి ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లలో వీరు సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకుని బాగా లబ్ధి పొందుతారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. కొద్ది ప్రయత్నంతో అత్యధిక ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగంలో తమ సమర్థ తను నిరూపించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్ది మార్పులతో బాగా పురోగతి చెందుతారు.

మకరం: తృతీయ స్థానంలో రాశ్యధిపతి శనితో చంద్రుడు యుతి చెందడం వల్ల ఈ రాశివారికి ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇష్టపడ్డ వ్యక్తితో వివాహం చేసుకోవడానికి అవకాశం ఉంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయాలు సాధించి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల, ప్రయత్నాల వల్ల లాభాలు కలుగుతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఎక్కువగా విజయాలు, సాఫల్యాలు లభిస్తాయి.

మీనం: ఈ రాశిలో శని, చంద్రులు కలవడం, దాన్ని పంచమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న రాశ్యధిపతి గురువు వీక్షించడం వల్ల ఈ రాశివారికి ఏలిన్నాటి శని ప్రభావం పూర్తిగా తగ్గిపోయి, జీవితం వైభవంగా సాగిపోతుంది. ఈ మూడు రోజుల కాలంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, ఎటువంటి ప్రయత్నం చేపట్టినా నూరు శాతం సఫలమవుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి.వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగుతాయి. అన్ని వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది.