
జ్యోతిష్య శాస్త్రం మాదిరిగానే సంఖ్యాశాస్త్రం కూడా మనిషి వ్యక్తిత్వానికి సంబంధించిన విషయాలను వెల్లడిస్తోంది. మనం పుట్టిన తేదీని బట్టి మన స్వభావాన్ని అంచనా వేసి తెలియజేస్తుంది.

కొన్ని ప్రత్యేకమైన రాడిక్స్ నెంబర్లు అంటే మూల సంఖ్య కలిగి ఉన్నవారితో గొడవలు పెట్టుకోకూడదు. వారి అహం దెబ్బతింటే చాలా ఎదుటి వారిని జీవితాంతం క్షమించరు. వారితో గొడవలు, సంబంధాలు ప్రత్యేక పరిధిని కలిగి ఉంటాయి. అందుకే ఈ మూడు రాడిక్స్ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని సంఖ్యా శాస్త్రం చెబుతోంది.

రాడిక్స్ నంబర్ 1.. ఏ నెలలోనైనా 1, 10, 19, 28 తేదీలలో జన్మించిన వారి రాడిక్స్ సంఖ్య 1గా పరిగణించబడుతుంది. ఈ సంఖ్యకు అధిపతి సూర్యుడు. అందువల్ల ఈ తేదీలలో పుట్టిన వారిపై సూర్యుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు బలంగా కనిపిస్తాయి. తమ గౌరవాన్ని చాలా విలువైనదిగా భావిస్తారు. ఎవరి వల్లైనా తమ అహానికి దెబ్బ తగిలితే దాన్ని సులభంగా మరిచిపోరు. ఒకసారి మనసుకు నొప్పి కలిగితే ఆ వ్యక్తిని దూరంగా ఉంచుతారు. తమ అభిప్రాయాలను ఎలాంటి సంకోచం లేకుండా నేరుగా చెప్పే స్వభావం వీరిది.

రాడిక్స్ నంబర్ 8.. ఏ నెలలోనైనా 8, 17, 26 తేదీలలో జన్మించిన వారి రాడిక్స్ సంఖ్య 8. ఈ సంఖ్యకు అధిపతి శని. శని ప్రభావం వల్ల వీరు కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు. గంభీరత, బాధ్యతాయుత దృక్పథం వీరిలో కనిపిస్తాయి. జనాల్లో కలిసిమెలిసి ఉండడం కంటే కొద్దిమందితో లేదా ఒంటరిగా ఉండడానికే ఎక్కువగా ఇష్టపడతారు. వీరికి సహనం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఎవరైనా తీవ్రంగా నొప్పిస్తే, ఆ విషయాన్ని జీవితాంతం మర్చిపోరు. నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ, వారి భావాలు లోతైనవిగా ఉంటాయి.

రాడిక్స్ నంబర్ 9.. ఏ నెలలోనైనా 9, 18, 27 తేదీలలో జన్మించిన వారి రాడిక్స్ సంఖ్య 9. ఈ సంఖ్యకు అధిపతి కుజుడు. కుజుడి ప్రభావంతో వీరు ధైర్యవంతులు, ఉత్సాహభరితులు. ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనే గుణం వీరిలో ఉంటుంది. రిస్క్ తీసుకోవడంలో వెనుకాడరు. తమ గురించి ఎవరు చెడుగా మాట్లాడినా సహించరు. ముఖ్యంగా అవమానాన్ని అసలు భరించలేరు. ఎవరైనా తమను అవమానించాలనుకుంటే, భయపడకుండా ధైర్యంగా సమాధానం ఇస్తారు. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం సంఖ్యా శాస్త్రం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉన్నాయి. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)