
రైతన్నలకు ఎంతో ఇష్టమైన మృగశిర కార్తె రాబోతుంది. ఈ కార్తె సమయంలో తొలకరి చినుకులు పడతాయి. దీంతో రైతులు దుక్కి దున్ని విత్తనాలు నాటి పొలం పనులు చేస్తుంటారు. ముఖ్యంగా మృగశిరంలో ఎంత ఎక్కువగా వర్షాలు పడితే అంత మంచిదంటారు. ఎందుకంటే? ఈ సమయంలో నాటే విత్తనం మంచి దిగుబడిని ఇస్తుందని చెబుతారు. అందుకే రైతులు మృగశిర వానల కోసం ఆశగా ఎదురు చూస్తారు.

అయితే (2026) ఈ సంవత్సరంలో జూన్ 8నుంచి మృగశిర కార్తె ప్రారంభం కానుంది. సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించడాన్ని మృగశిర కార్తె అంటారు. ఈ కార్తె జూన్ 8న ప్రారంభమై, జూన్ 22న ముగిసిపోతుంది. ఇక జూన్ 23 నుంచి ఆరుద్ర కార్తె ప్రారంభం అవుతుంది. అయితే మృగశిర కార్తెలో ఎలాంటి పంటలు వేయడం వలన మంచి దిగుబడి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మృగశిర కార్తెలో విత్తనాలు నాటడం చాలా మంచిది అంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ సీజన్ కాబట్టి, రైతులు పంట మంచి దిగుబడి రావడానికి పత్తి విత్తనాలు నాటుతారు. ఈ సమయంలో విత్తనాలు నాటడం వలన పూత, కాత సరైన సమయానికి వస్తుంది. అలా మంచి దిగుబడి వస్తుందంట. అందుకే చాలా మంది ఈ సమయంలో పత్తి విత్తనాలు, మొక్కజొన్న విత్తనాలు నాటుతారు.

ముఖ్యంగా ఈ సమయంలో వరి, విత్తనాలు చల్లడం, కొన్ని ప్రదేశాల్లో నాట్లు వేయడం కూడా చేస్తుంటారు. అంతే కాకుండా కంది, పెసర, మినుములు వంటి పప్పు ధాన్యాలను విత్తుతారు. ఇవే కాకుండా కూరగాయలు టమాట, వంకాయ, బెండకాయ, బీరకాయ వంటి కూరగాయ విత్తనాలు కూడా నాటుతారు. మృగశిరం సమయంలో ఈ విత్తనాలు నాటడం వలన మంచి దిగుబడి వస్తుందంట.

నోట్ : ఈ వార్తలో ఇవ్వబడిన సమాచారం కేవలం నిపుణులు, పండితులు, ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.