
మేషం: ఈ రాశికి అత్యంత పాపి అయిన బుధుడు వ్యయ స్థానంలోకి మారడం, అత్యంత శుభుడైన రవి సొంత రాశిలోకి మారడం వల్ల ఈ రాశివారికి ఆర్థికంగా ఉన్నత స్థితి లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా వృత్తి, వ్యాపారాలు, సొంత ఆదాయ వృద్ధి ప్రయత్నాలు విజయవంతంగా సాగిపోవడం జరుగుతుంది. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభించడం, వైద్య ఖర్చులు బాగా తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు అందుతాయి. మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది.

మిథునం: రాశ్యధిపతి బుధుడు దశమంలో నీచభంగం పొందడం, రవి లాభ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల ఈ నెల (ఏప్రిల్) 14 తర్వాత నుంచి వీరికి ఏ రంగంలో ఉన్నా విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆదాయం అంచనాలను మించుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. శుభవార్తలు వింటారు.

కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో బుధుడు, దశమ స్థానంలో రవి సంచారం ప్రారంభించడం వల్ల ఈ రాశివారికి విదేశీ అవకాశాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కలగడంతో పాటు, విదేశాల్లోనే ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం ఖాయమయ్యే సూచనలున్నాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.

వృశ్చికం: ఈ రాశికి పంచమ స్థానంలో బుధుడు, షష్ట స్థానంలో రవి ప్రవేశం వల్ల కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఘన విజయాలు సాధిస్తాయి. నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలకు మించి లాభిస్తాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన ప్రాప్తికి సంబంధించి శుభవార్త వింటారు. అధికారులు మీ సలహాలు, సూచనలతో బాగా లబ్ధి పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్, యాక్టివిటీ, రాబడి బాగా పెరుగుతాయి.

ధనుస్సు: ఈ రాశికి చతుర్థంలో బుధుడు నీచభంగం చెందడం, రవి పంచమ స్థానంలో ఉచ్ఛ స్థితిలోకి రావడం వల్ల ఉద్యోగంలో పదోన్నతులకు బాగా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది.

మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో బుధుడు, చతుర్థ స్థానంలో ఉచ్ఛ రవి సంచారం వల్ల ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విజయం సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాలు విజయం సాధిస్తాయి. ప్రముఖులతో ఊహించని పరిచయాలు కలుగుతాయి. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.