
ఈ నెల(ఏప్రిల్) 30వ తేదీ నుంచి మే 14 వరకు మీన రాశిలో కుజ, శనులు మాత్రమే సంచారం చేయడం జరుగుతోంది. సాధారణంగా ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు రాజయోగాలు ఎక్కువగా కలుగుతాయి. ఈ రెండు పాప గ్రహాలు కలవడం వల్ల ఉద్యోగాల్లో ఉన్నవారికి తప్పకుండా అధికార యోగం పడుతుంది. వృషభం, మిథునం, కర్కాటకం, వృశ్చికం, మకరం, మీన రాశులవారి జీవితాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశీ అవకాశాలు బాగా వృద్ధి చెందుతాయి. రాజకీయాలు, ప్రభుత్వం, మిలిటరీ, పోలీస్, రియల్ ఎస్టేట్, లిక్కర్ రంగాల్లో ఉన్నవారికి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది.

వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో శని, కుజుల యుతి జరగడం వల్ల ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా అందలాలు ఎక్కడం జరుగుతుంది. ముఖ్యంగా శీఘ్ర పురోగతికి అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు తప్పకుండా అధికార యోగం పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఘన విజయాలు సాధిస్తారు. రియల్ ఎస్టేట్, లిక్కర్ వ్యాపారాల్లో ఉన్నవారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే అవకాశం ఉంది.

మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో శని, కుజుల కలయిక జరగడం వల్ల ఉద్యోగంలో అధికార యోగం పట్టడానికి అవకాశం ఉంది. ఈ రాశివారు మిలిటరీ, పోలీస్, ప్రభుత్వ రంగాల్లో ఉన్న పక్షంలో తమ సమర్థతను నిరూపించుకోవడం జరుగుతుంది. వీరికి మరో రెండు నెలల పాటు ఇటువంటి రంగాలలో ఉద్యోగాలు లభించే అవకాశం కూడా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కొత్త పుంతలు తొక్కుతారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు అనేక ఉద్యోగ ఆఫర్లు, అవకాశాలు లభిస్తాయి.

కర్కాటకం: ఈ రాశికి భాగ్యస్థానంలో శని, కుజుల కలయిక జరగడం వల్ల ఉద్యోగంలో అధికార యోగం పట్టడానికి బాగా అవకాశం ఉంది. అధికారం చేపట్టడానికి అవకాశం ఉన్న ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో విదేశీ ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశీ పర్యటనలు చేయవలసి వస్తుంది. భూ సంబంధమైన వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. మిలిటరీ, పోలీస్ శాఖల్లో ఉన్నవారికి ఆశించిన గుర్తింపుతో పాటు హోదాలు లభిస్తాయి.

వృశ్చికం: పంచమ స్థానంలో ఉన్న రాశ్యధిపతి కుజుడితో శని కలవడం వల్ల ఈ రాశివారు ఉన్నత పదవులు పొందడానికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగాల్లో గరిష్ఠ స్థాయిలో అధికారం చెలాయించడం జరుగుతుంది. మిలిటరీ, పోలీస్, రియల్ ఎస్టేట్ రంగాలవారు తమ రంగాల్లో బాగా రాణించడం, పదోన్నతులు పొందడం వంటివి జరుగుతాయి. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా అరుదైన ఆఫర్లు, అవకాశాలు అందుతాయి.

మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో ఉన్న శని, కుజులు కలవడం వల్ల ఈ రాశివారు ఉన్నతోద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధించడం జరుగుతుంది. నిరుద్యోగులకు తప్పకుండా విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. మిలిటరీ, పోలీస్, లిక్కర్ వంటి రంగాల్లో బాగా రాణించడానికి అవకాశం ఉంది. షేర్ల ద్వారా బాగా లాభాలు గడించడం జరుగుతుంది.

మీనం: ఈ రాశిలో ఉన్న శనితో కుజుడు కలిసి ఉండడం వల్ల రియల్ ఎస్టేట్, లిక్కర్ వంటి వ్యాపారాల్లో ఈ రాశివారు అపారమైన ధన లాభం పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు, పోలీస్ శాఖ వారు గుర్తింపు పొందడంతో పాటు పదోన్నతులు పొందే అవకాశం కూడా ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. భూలాభం కలుగుతుంది.