
వృషభం: ఈ రాశికి రాశ్యధిపతి శుక్రుడితో పాటు బుధ, గురువులు కూడా ధన స్థానంలో సంచారం చేస్తుండడంతో పాటు శుక్ర, బుధుల మధ్య పరివర్తన కూడా జరిగినందువల్ల ఈ రాశివారికి అనేక విధా లుగా లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ఆదాయం వృద్ధి చెందడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరగడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది.

మిథునం: ఈ రాశికి రాశ్యధిపతి బుధుడు, శుక్రుడు, గురువు బాగా అనుకూల స్థానాల్లో సంచారం చేస్తుం డడం వల్ల లక్ష్మీ కటాక్షం లభించి మహా భాగ్య యోగాలు కలుగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, లాటరీలు, వడ్డీ వ్యాపారాలు వగైరాల వల్ల అపార ధన లాభాలు కలుగుతాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. విదేశీ సంపాదన అనుభవించే యోగం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

సింహం: ఈ రాశికి దశమ, లాభ స్థానాల్లో శుభ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి తిరుగులేని లక్ష్మీ కటాక్షం కలిగింది. మే చివరి వరకు ఈ రాశివారికి ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటు లేకపోవడం వంటివి జరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరగడం, సుఖ సంతోషాలు వృద్ధి చెందడం జరుగుతుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో ప్రేమలో పడడం లేదా పెళ్లి కుదరడం వంటివి జరుగుతాయి.

కన్య: ఈ రాశికి భాగ్య, దశమ స్థానాల్లో రాశ్యధిపతి బుధుడితో పాటు గురు, శుక్రుల సంచారం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. రావలసిన సొమ్ముతో పాటు మొండి బాకీలు, బకాయిలు కూడా వసూలవుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. పిత్రార్జితం లభిస్తుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి నిశ్చయం కావడం జరుగుతుంది. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది.

మకరం: ఈ రాశికి బాగా అనుకూల స్థానాల్లో మూడు సహజ శుభ గ్రహాల సంచారం జరుగుతున్నందువల్ల ఈ రాశివారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలన్నీ సంపూర్ణ ఫలితాలనిస్తాయి. షేర్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు, లాటరీలు అపార ధన లాభం కలిగిస్తాయి. ఆస్తి వివాదాలు, సమస్యలు అనుకూలంగా పరిష్కారమై ఆర్థిక, ఆస్తి లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతాయి.

కుంభం: ఈ రాశికి చతుర్థ, పంచమ స్థానాల్లో శుభ గ్రహాల శని సంచారం వల్ల ఏలిన్నాటి శని దోషం కూడా తగ్గిపోతుంది. అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. రావలసిన సొమ్ముతో పాటు బాకీలు, బకాయిలు పూర్తిగా వసూలవుతాయి. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం ఆశించిన స్థాయిలో మెరుగుపడుతుంది.