
జాతకంలో గానీ, గ్రహ సంచారంలో గానీ కుబేర యోగం లేదా లక్ష్మీ కటాక్ష యోగం పట్టాలన్న పక్షంలో ధన, భాగ్య, లాభ స్థానాలు బలంగా ఉండాలి. ఈ ధన, భాగ్య, లాభాధిపతులు అనుకూలంగా ఉండే పక్షంలో లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలిగి, సామాన్యుడు కూడా సంపన్నుడవుతాడు. సెప్టెంబర్ మాసంలో ఈ మూడు స్థానాల అధిపతులు బలంగా ఉండి, లక్ష్మీ కటాక్షం కలిగే రాశులు వృషభం, మిథునం, సింహం, తుల, మకరం, మీన రాశులు. వీరికి ఆకస్మిక ధన లాభానికి, లాటరీ గెలుచుకోవడానికి, వృత్తి, వ్యాపార, ఉద్యోగాలపరంగా ఆదాయం పెరగడానికి బాగా అవకాశం ఉంది.

వృషభం: ఈ రాశికి ఈ నెలంతా బుధ, శని, గురువు గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల మహా భాగ్య యోగాలు ఏర్పడుతున్నాయి. అతి కొద్ది ప్రయత్నంతో వీరి ఆర్థిక దశ తిరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి, అప్రయత్న ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఇబ్బడి ముబ్బడిగా లాభాలు గడిస్తారు. ధన కారకుడైన గురువు తృతీయంలో ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల అపార ధన లాభాలు కలుగుతాయి. పిత్రార్జితం లభిస్తుంది.

మిథునం: ఈ నెలంతా ధన, బాగ్య, లాభ స్థానాల అధిపతులైన చంద్ర, కుజ, శని గ్రహాలు బాగా అనుకూ లంగా ఉన్నందువల్ల ఈ రాశివారు కొద్దిపాటి ప్రయత్నంతో కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు విస్తరించడంతో పాటు జీతభత్యాలు, రాబడి, లాభాలు కూడా పెరగడం జరుగు తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలలో కొద్దిపాటి పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని ధన లాభాలు కలుగుతాయి. ఆస్తిపాస్తుల విలువ కూడా అంచనాలను మించిబాగా పెరుగుతుంది.

సింహం: ఈ రాశికి భాగ్యాధిపతి కుజుడు, ధన, లాభాధిపతి బుధుడు ఈ నెలంతా అనుకూలంగా ఉండడం వల్ల సగటు వ్యక్తి కూడా సంపన్నుడయ్యే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయ మార్గాలు బాగా విస్తరించి అధిక లాభాలు కలుగుతాయి. లాభ స్థానంలో కుజ సంచారం వల్ల వీరి ఆదాయవృద్ధి ప్రయత్నాలన్నీ నూరు శాతం ఫలిస్తాయి. ఆకస్మిక ధన లాభానికి, అంచనాలకు మించిన ధన సంపాదనకు అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో వీరిని లక్ష్మీదేవి తప్పకుండా కటాక్షిస్తుంది.

తుల: భాగ్యాధిపతి, ధన స్థానాధిపతి, లాభ స్థానాధిపతి ముగ్గురూ అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశి వారు ఈ నెల తప్పకుండా సంపన్నులు కావడానికి, లక్ష్మీకటాక్షానికి పాత్రులు కావడానికి అవ కాశం ఉంది. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. రావలసిన సొమ్ము, బాకీలు చేతికి అందుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఈ రాశివారు అంచనాలకు మించి ఆర్థిక లాభాలు పొందడం జరుగుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది.

మకరం: భాగ్యాధిపతి బుధుడు, లాభ స్థానాధిపతి కుజుడు, ధనాధిపతి శని ఈ నెలంతా అనుకూలంగా ఉంటున్నందువల్ల ఆదాయానికి ఏమాత్రం లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. కొంత ప్రయత్నంతోనూ, కొంత అప్రయత్నంగానూ ఈ రాశి వారు లక్ష్మీ కటాక్షానికి పాత్రులయ్యే అవకాశం ఉంది. ఆస్తుల విలువ పెరుగుతుంది. ఆస్తిపాస్తుల్ని సమకూర్చుకోవడం జరుగుతుంది. ఆస్తి వివాదం పరిష్కారమై, భూ లాభం కలుగుతుంది.

మీనం: ధన, భాగ్య, లాభ స్థానాధిపతులతో పాటు రాశ్యధిపతి గురువు కూడా అనుకూలంగా సంచారం చేస్తున్నందువల్ల, ఈ రాశివారు శుభ యోగాలను అనుభవించే అవకాశం ఉంది. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. ఈ రాశివారు సెప్టెంబర్ 7 నుంచి లక్ష్మీ కటాక్షానికి పాత్రులయ్యే అవ కాశాలు కనిపిస్తున్నాయి. రావలసిన డబ్బును కొద్ది ప్రయత్నంతో రాబట్టుకోవడం జరుగుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. షేర్లు, మదుపులు, పెట్టుబడులు విశేషంగా లాభిస్తాయి.