
సహజంగా దీపావళి అంటేనే ఇంట్లో, లేదంటే షాపులు ఇతర ప్రాంతంలో వేడుకలు నిర్వహించుకుంటాము. అంతేకాకుండా బాణ సంచాలు, టపాసులు పేల్చుతుంటాము. కుటుంబ సభ్యులు అందరూ కలిసి సంతోషంగా ఈ వేడుకలు నిర్వహించుకుంటారు. ఇలా ప్రతి ఒక్కరూ వేడుకలు నిర్వహించుకోవడం సర్వసాధారణం.. కానీ.. కరీంనగర్లోని కార్ఖానా గడ్డలో మాత్రం.. స్మశాన వేటికలో దీపావళి పండుగను నిర్వహించుకుంటారు. అలా ఎందుకు నిర్వహించుకుంటారు ఇప్పుడు తెలుసుకుందాం.

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కార్ఖానా గడ్డలో రెండు పెద్ద స్మశాన వాటికలు ఉన్నాయి. ఈ స్మశాన వాటికలు కిసాన్ నగర్, పసుల నారాయణ కాలనీ తదితర ప్రాంతాల్లో చనిపోయిన వారిని ఇక్కడ అంత్యక్రియ నిర్వహిస్తారు. సాధారణంగా.. దసరా కంటే ముందు పితృ అమావాస్య సందర్భంగా పెద్దలకు బియ్యం ఇవ్వడం ఆనవాయితీ. ఇక్కడ మాత్రం దీపావళి పర్వదినం సందర్భంగా.. పెద్దలను గుర్తు చేసుకుంటారు.

పండుగా కంటే ముందే సమాధులని.. శుభ్రం చేసి.. రంగులు వేస్తారు. అదేవిధంగా దీపావళి పండుగ రోజు.. సాయంత్రం ఇక్కడికి కుటుంబ సభ్యులు వచ్చి పెద్దలను గుర్తు చేసుకుని.. దీపాలు వెలిగిస్తారు. తర్వాత వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను సమాధుల వద్దనే పెడతారు. కుటుంబ సభ్యులందరికీ కలిసి సమాధుల వద్దనే దీపావళి వేడుకలను నిర్వహించుకుంటారు. అక్కడే బాణసంచాలు పేల్చుతారు. కనీసం మూడు నాలుగు గంటల పాటు సమాధుల వద్దనే ఉంటారు. వారికి సంతాప సూచకంగా.. కొద్దిసేపు మౌనం పాటిస్తారు. తర్వాత ఇంటి వద్ద జరుపుకునే దీపావళి వేడుకను పెద్దల సమాధి వద్దనే నిర్వహించుకుంటున్నారు.

చాలా ఏళ్లుగా.. ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. దీంతో స్మశాన వాటిక మొత్తం కూడా దీపావళి పర్వదినం సందర్భంగా దీపాలతో కనబడుతుంటుంది. అదేవిధంగా ఈ స్మశాన వాటిక బాణసంచాలు, క్రాకర్స్, చిచ్చుబుడ్డిల వెలుగుల్లో కనబడుతుంది. చిన్న పెద్దా.. తేడా లేకుండా.. సమాధి వద్దనే దీపాలను వెలిగించి దీపావళి నిర్వహించుకుంటారు.

ఎక్కడ కూడా ఇలాంటి దృశ్యాలు కనబడవు. కేవలం ఖర్ఖానగడ్డ స్మశాన వాటికలు మాత్రమే దీపావళి పర్వదినం సందర్భంగా పెద్దలను గుర్తు చేసుకుంటూ వారికి నివాళులర్పిస్తారు. అదేవిధంగా దీపావళి వేడుకలు కూడా వారిని గుర్తు చేసుకుంటూ ఇక్కడే నిర్వహిస్తారు. స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తుంటారు. పెద్దలను గుర్తు చేసుకోవడానికి దీపావళి సందర్భంగా సమాధుల వద్ద దీపాలు వెలిగించి క్రాకర్స్ కలుస్తామని అక్కడికి వచ్చినవారు చెబుతున్నారు.