
భారతీయ సంస్కృతిలో బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు; అది సంపద, శ్రేయస్సు, శుభానికి ప్రతీక. వివాహాలు, పండుగలు, శుభకార్యాల్లో బంగారం ధరించడం లక్ష్మీదేవి కటాక్షానికి సూచికగా భావిస్తారు. కాబట్టి బంగారం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా ముఖ్యమైన విషయం.

బంగారం (Gold) పోగొట్టుకోవడం గురించి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది. కొందరి నమ్మకం ప్రకారం ఇది కేతు, శని, రాహు వంటి గ్రహాల ప్రతికూల ప్రభావాన్ని సూచిస్తుంది. ఈ గ్రహాలు జాతకంలో అనుకూలంగా లేకపోతే ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు, అనుకోని కష్టాలు ఎదురయ్యే అవకాశముందని భావిస్తారు. అందుకే బంగారం కోల్పోవడం కేవలం వస్తువు నష్టం మాత్రమే కాదు, దురదృష్టానికి సంకేతంగా కూడా పరిగణిస్తారు.

ఇక మరోవైపు, రోడ్డు మీద లేదా ప్రయాణంలో బంగారం దొరికితే అది అదృష్టమని చాలా మంది భావిస్తారు. కానీ, జ్యోతిష్య దృష్టిలో ఇది అంత మంచిది కాదని చెబుతారు. సూర్యుడు, బృహస్పతి వంటి గ్రహాల ప్రతికూల స్థితిని ఇది సూచిస్తుందని నమ్మకం. దాని వల్ల వ్యక్తి కీర్తి, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం, సమాజంలో గౌరవం తగ్గడం వంటి పరిస్థితులు రావచ్చని అంటారు.

అందువల్ల రోడ్డుపై దొరికిన బంగారాన్ని స్వంతం చేసుకోవడం కంటే దాన్ని దానం చేయడం ఉత్తమమని సూచిస్తారు. ముఖ్యంగా గురువారం రోజున బ్రాహ్మణులకు లేదా అవసరమైన వారికి దానం చేస్తే ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని నమ్మకం ఉంది. దీనివల్ల మనసుకు శాంతి, జీవనంలో సమతుల్యత లభిస్తాయని భావిస్తారు.

మొత్తానికి, బంగారం పోగొట్టుకున్నా లేదా దొరికినా, ఆ పరిస్థితిని జాగ్రత్తగా, ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించడం మంచిదని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది. ఇలా చేయడం ద్వారా ప్రతికూల పరిస్థితులను తగ్గించుకుని, శాంతియుతమైన జీవితం గడపవచ్చు. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)