
జ్యోతిషశాస్త్రం ప్రకారం గురు, బుధ, శుక్రులు ఏ రాశిలో సంచారం చేస్తే ఆ రాశులకు శుభ ఫలితాలనిస్తాయి. అంతేకాదు, వాటి దృష్టి పడిన రాశులు కూడా ఒక వెలుగు వెలుగుతాయి. శుభ గ్రహాలు సప్తమ దృష్టితో వీక్షిస్తున్న రాశుల వారి జీవితాలు విజయాలు, సాఫల్యాలతో సాగిపోతాయని జ్యోతిషశాస్త్రం చెబుతుంది. ప్రస్తుతం వృషభం, మిథునం, మీన రాశుల్లో సంచారం చేస్తున్న శుక్ర, గురు, బుధ గ్రహాల వల్ల కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, కుంభ రాశులు ఇప్పటి నుంచి జూన్ వరకు అత్యధికంగా లాభాలు పొందబోతున్నాయి. వీరికి ఆదాయ వృద్ధి, ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో విజయాలు, విదేశీయానాలు, ఆస్తి లాభాలు వంటివి తప్పకుండా కలిగే అవకాశం ఉంది.

కన్య: ఈ రాశి మీద రాశ్యధిపతి బుధుడి సప్తమ దృష్టి పడుతున్నందువల్ల కొద్ది ప్రయత్నంతో వీరి మనసులోని కోరికలు నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశివారి సొంత ఇంటి కల నెరవేరుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. నైపుణ్యాలు, కమ్యూనికేషన్ చాతుర్యాలు బాగా మెరుగుపడతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల కూడా అపార ధన లాభం కలుగుతుంది. ఆర్థిక, వ్యక్తి గత సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. కెరీర్ పరంగా శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది.

తుల: ఈ రాశి మీద గురు దృష్టి ఉన్నందువల్ల ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన కోరికలన్నీ నెరవేరుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ఆశించిన పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కష్టనష్టాల నుంచి బయటపడతాయి. విదేశీయానానికి అడ్డంకులు తొలగుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగం లభిస్తుంది. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు.

వృశ్చికం: ఈ రాశి మీద శుక్రుడి దృష్టి ఉన్నందువల్ల త్వరలో ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. జీత భత్యాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా కలిసి వస్తాయి. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయగల స్థితిలో ఉంటారు.

ధనుస్సు: ఈ రాశి మీద రాశ్యధిపతి గురువు దృష్టి ఉన్నందువల్ల లాభదాయక వ్యవహారాలు, కార్యక్రమాలు చేపడతారు. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులతో పాటు ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగం లభిస్తుంది.

కుంభం: ఈ రాశి మీద గురు దృష్టి పడడం వల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు దాదాపు పూర్తిగా సమసిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికార యోగం పట్టే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.