
కావాల్సిన పదార్థాలు : ఎగ్స్ నాలుగు నుంచి ఆరు వరకు. రుచికి సరిపడ ఉప్పు , కారం ,నిమ్మరసం: అర కప్పు, ధనియాల పొడి: ఒక స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్: రెండు స్పూన్లు, ఆవపొడి,మెంతి పొడి, పసుపు, గరం మసాలా, మిరియాల పొడి, నూనె, కరివేపాకు

తయారీలోకి వెళ్లితే. ముందుగా ఎగ్స్ తీసుకోవాలి. గుడ్లను పగలగొట్టి మ్యాష్ చేసువాలి. తర్వాత దీనిలో ఒక స్పూన్ మిరియాల పొడి,ఒక స్పూన్ ఉప్పు కలిపి బాగా మ్యాష్ చేయాలి. తర్వాత ఒక చిన్న గిన్నెకు నూనె రాసి, ఈ మ్యాష్ చేసిన గుడ్డు మిశ్రమాన్ని అందులో వేయాలి. ఒక మందపాటి పాత్రలో కొద్దిగా నీళ్లు పోసి వేడి చేసి, స్టాండ్ పెట్టి ఈ గుడ్డు మిశ్రమం ఉన్న గిన్నెను అందులో పెట్టి ఆవిరిపై ఉడికించాలి. ఇది ఒక ఆమ్లెట్ లాగా తయారవుతుంది.

తర్వాత మరొక క పాన్ తీసుకుని అందులో ఒక కప్పు నూనె వేడి చేయాలి. నూనె వేడి అయిన తర్వాత, రెండు స్పూన్ల తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చడికి మంచి రుచిని ఇస్తుంది. తరువాత, పావు స్పూన్ మెంతి పొడి, ఒక స్పూన్ గరం మసాలా, రెండు స్పూన్ల ఆవపొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ పసుపు వేసి నూనెలో బాగా వేయించాలి. మసాలాలు నూనెలో బాగా వేగితేనే పచ్చడికి మంచి రుచి వస్తుంది. కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించాలి. ఆ తరువాత, అర కప్పు కారం,ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి, చల్లబరచడానికి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి.

ఆవిరిపై ఉడికించిన గుడ్డు ఆమ్లెట్‌ను బయటకు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే, గుడ్డులోని తేమ పూర్తిగా పోయేలా నూనెలో డీప్ ఫ్రై చేయాలి. మరొక కడాయిలో మూడు స్పూన్ల నూనె వేసి, తక్కువ మంటపై ఈ గుడ్డు ముక్కలను గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేవరకు సుమారు 20 నిమిషాల పాటు వేయించాలి. తక్కువ మంటపై వేయించడం వల్ల ముక్కలు లోపల వరకు వేగి మంచి రుచి వస్తాయి.

వేయించిన గుడ్డు ముక్కలను చల్లబడిన మసాలా మిశ్రమంలో వేసి బాగా కలపాలి. గుడ్లు వేయించిన నూనెను కూడా ఈ మిశ్రమంలో వేయాలి. చివరిగా, అర కప్పు నిమ్మరసం పోసి బాగా కలపాలి. నిమ్మరసం పచ్చడికి పుల్లని రుచిని ఇవ్వడమే కాకుండా, ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి సహాయపడుతుంది. అంతే టేస్టీ టేస్టీ ఎగ్ పచ్చడి రెడీ.