
పెట్రోల్ బంకుకు వెళ్లినప్పుడు సాధారణ పెట్రోల్ కొట్టించాలా? లేక పవర్ పెట్రోల్ పోయించాలా? అనే డౌట్ చాలా మంది వాహనదారులకు వస్తుంటుంది. ప్రీమియం పెట్రోల్ వాడితే మైలేజీ పెరుగుతుందని కొందరు, ఇంజిన్ లైఫ్ పెరుగుతుందని మరికొందరు భావిస్తుంటారు. అసలు ఈ రెండింటి మధ్య ఉన్న టెక్నికల్ తేడా ఏంటీ..? మీ కారు లేదా బైక్‌కు ఏది అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏమిటీ ఆక్టేన్ రేటింగ్?: సాధారణ, ప్రీమియం పెట్రోల్ మధ్య ఉన్న అతిపెద్ద వ్యత్యాసం ఆక్టేన్ రేటింగ్. సులభంగా చెప్పాలంటే, ఇంజిన్‌లో ఇంధనం ఎంత క్రమబద్ధంగా మండుతుందో ఈ రేటింగ్ నిర్ణయిస్తుంది. సాధారణ పెట్రోల్ ఆక్టేన్ రేటింగ్ సాధారణంగా 87 నుండి 91 వరకు ఉంటుంది. పవర్ పెట్రోల్ రేటింగ్ 91 నుండి 95 వరకు ఉంటుంది. ఇంధనం త్వరగా, అస్తవ్యస్తంగా మండిపోతే ఇంజిన్ నుండి నాకింగ్ అనే శబ్దం వస్తుంది. అధిక ఆక్టేన్ రేటింగ్ ఉన్న పవర్ పెట్రోల్ ఈ నాకింగ్‌ను అరికట్టి, ఇంధనం సజావుగా మండేలా చేస్తుంది.

ఇంజిన్ అంతర్గత శుభ్రత: పవర్ పెట్రోల్ ధర ఎక్కువగా ఉండటానికి కేవలం ఆక్టేన్ మాత్రమే కారణం కాదు. ఇందులో కలిపే ప్రత్యేకమైన డిటర్జెంట్లు, రసాయనాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి ఇంజిన్ లోపల, ముఖ్యంగా ఫ్యూయల్ ఇంజెక్టర్లు, వాల్వ్‌ల వద్ద పేరుకుపోయిన కార్బన్‌ను శుభ్రపరుస్తాయి. దీనివల్ల ఇంజిన్ భాగాలు ఎక్కువ కాలం మన్నికగా ఉండటమే కాకుండా, పనితీరు మెరుగుపడుతుంది.

ధర ఎందుకు ఎక్కువ?: సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ప్రీమియం పెట్రోల్ లీటరుకు కొన్ని రూపాయలు ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. అధిక ఆక్టేన్ స్థాయిని సాధించడానికి ఇంధనాన్ని శుద్ధి చేసే విధానం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఇంజిన్ రక్షణ కోసం వాడే అదనపు కెమికల్స్ వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది.

మీ వాహనానికి ఏది సరైనది?: పవర్ పెట్రోల్ వాడితే మైలేజీ విపరీతంగా పెరిగిపోతుందని అనుకోవడం ఒక అపోహ మాత్రమే. ఇది పూర్తిగా మీ వాహనం ఇంజిన్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. మనం నిత్యం వాడే స్కూటర్లు, సాధారణ కార్ల ఇంజిన్లు తక్కువ కంప్రెషన్‌తో నడిచేలా రూపొందించబడతాయి. వీటికి సాధారణ పెట్రోల్ సరిపోతుంది. అధిక పనితీరు కనబరిచే ఖరీదైన కార్లలో ప్రీమియం పెట్రోల్ వాడటం తప్పనిసరి. లేదంటే ఇంజిన్ దెబ్బతినే అవకాశం ఉంది.