
కరకరలాడే హెల్తీ ఆలూ పీల్ చిప్స్: బంగాళాదుంప తొక్కలను పారేయకుండా వాటితో క్రిస్పీ చిప్స్ తయారు చేసుకోవచ్చు. ముందుగా తొక్కలను బాగా కడిగి, ఆరబెట్టాలి. ఆ తర్వాత కొద్దిగా ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనె, మిరియాల పొడి, చాట్ మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి. వీటిని ఓవెన్‌లో లేదా ఎయిర్ ఫ్రైయర్‌లో బేక్ చేయొచ్చు, లేదా నార్మల్ పాన్‌లో వేయించుకుంటే అద్భుతమైన, కరకరలాడే హెల్తీ చిప్స్ రెడీ అవుతాయి.

కూరలు, సూప్‌లలో థిక్‌నర్‌గా: చాలామంది కూరలు లేదా సూప్‌లు చిక్కగా రావడం కోసం కార్న్ ఫ్లోర్ వాడుతుంటారు. దానికి బదులుగా బంగాళాదుంప తొక్కలను ఉపయోగించవచ్చు. శుభ్రం చేసిన తొక్కలను బాగా ఉడకబెట్టి, మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. ఈ పేస్ట్‌ను సూప్‌లు లేదా వెజిటబుల్ గ్రేవీ కూరల్లో కలిపితే.. కూర రుచి పెరగడమే కాకుండా గ్రేవీ కూడా పర్ఫెక్ట్‌గా చిక్కబడుతుంది.

ఇంట్లోనే హోమ్‌మేడ్ వెజిటబుల్ స్టాక్: కూరగాయల సూప్‌లు, నూడుల్స్ వండేటప్పుడు మంచి ఫ్లేవర్ కోసం వాడే వెజిటబుల్ స్టాక్‌ను బంగాళాదుంప తొక్కలతో ఇంట్లోనే ఈజీగా చేయవచ్చు. కడిగి శుభ్రం చేసిన ఆలూ తొక్కలతో పాటు క్యారెట్, ఉల్లిపాయ ముక్కలను నీటిలో వేసి బాగా ఉడకబెట్టి, ఆ నీటిని వడకట్టాలి. ఈ వెజిటబుల్ స్టాక్‌ను ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుకుని, ఎప్పుడు సూప్‌లు చేసినా బేస్ లిక్విడ్‌గా వాడుకోవచ్చు.

వర్షాకాలంలో వేడివేడి ఆలూ పీల్ పకోడా: మనం రెగ్యులర్‌గా చేసుకునే ఉల్లిపాయ పకోడీ లాగే.. ఆలూ తొక్కలను నిలువుగా పొడవుగా కోసి క్రిస్పీ పకోడీలు వేసుకోవచ్చు. ఈ తొక్కల్లో శనగపిండి, కారం పొడి, ఉప్పు, కొద్దిగా గరం మసాలా కలిపి నూనెలో డీప్ ఫ్రై చేయాలి. ముఖ్యంగా వర్షాకాలంలో లేదా సాయంత్రం పూట వేడివేడి టీతో పాటు తినడానికి ఇది ఒక అద్భుతమైన, డిఫరెంట్ స్నాక్ అవుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్త : బంగాళాదుంపలు భూమి లోపల, మట్టిలో పెరిగే దుంపలు కాబట్టి వాటి తొక్కలపై బ్యాక్టీరియా, కెమికల్స్ ఉండే అవకాశం ఉంది. అందుకే ఆలూ తొక్కలను వంటల్లో ఉపయోగించే ముందు కనీసం 10 నిమిషాల పాటు నీటిలో నానబెట్టి, ఆ తర్వాత చేత్తో బాగా రుద్ది, శుభ్రంగా కడగడం అస్సలు మర్చిపోవద్దు.