
అయితే ఈ వర్షాకాలంలో ఎలాంటి ప్రమాదాలు లేకుండా డ్రైవింగ్ సాఫీగా చేయాలి అంటే తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి అని చెబుతున్నారు నిపుణులు. కాగా, ఇప్పుడు మనం వర్షాలు పడుతున్న సమయంలో డ్రైవింగ్ చేసే వారు ఎలాంటి నియమాలు పాటించాలో వివరంగా తెలుసుకుందాం పదండి.

వాహనం, వాహనానికి మధ్య తగిన దూరం పాటిస్తూ డ్రైవింగ్ చేయాలి. వర్షాకాలం సమయంలో కొన్ని సార్లు సడన్ బ్రేక్ వేయాల్సి వస్తుంది. అయితే అటువంటి సమయంలో ఈ వాహనం మధ్య గ్యాప్ మిమ్మల్ని ప్రమాదం నుంచి కాపాడుతుంది. అందువలన వాహనం వాహనానికి మధ్య తప్పనిసరిగా తగిన దూరాన్ని పాటించాలి.

వర్షాలు పడుతున్న సమయంలో వీలైనంత వరకు వేగంగా వాహనాలు నడపకూడదు. అధిక వేగంతో డ్రైవింగ్ చేయడం వలన రోడ్లు తడిగా ఉండి జారుతుంటాయి. అంతే కాకుండా దీని వలన వాహనాలు స్లిప్ అవ్వడం, అదుపు తప్పిపడిపోవడం జరుగుతుంది. అందువలన వీలైనంత వరకు అధిక వేగాన్ని నియంత్రించి వాహనం నడపడం చాలా ముఖ్యం.

అదే విధంగా వాహన లైట్లు, వైపర్లను సరిగ్గా వాడుకోవాలి. వర్షంలో ఎదురుగా వచ్చే వాహనాలకు మీ వాహనం కనిపించాలంటే హెడ్ లైట్లు ఆన్ లో ఉంచాలి. పొగమంచు ఉంటే ఫాగ్ లైట్లు వాడాలి. చాలా మంది హెజార్డ్ లైట్లు వేసి నడుపుతుంటారు, అది తప్పు. వైపర్ బ్లేడ్లు అరిగిపోతే వెంటనే మార్చాలి. అద్దాలపై పొగమంచు పట్టకుండా డీఫాగర్ ఆన్ చేసుకోవాలి. లేకపోతే మీరు ప్రమాదంలో చిక్కుకునే ఛాన్స్ ఉంటుంది.

నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న చోట వాహనాన్ని నడపకూడదు. రోడ్డుపై నీరు నిలిచిన చోట ఎంత లోతు ఉందో తెలియదు. కాబట్టి నీరు ఎక్కువగా ఉన్న దారిలోకి వెళ్లకపోవడమే మంచిది. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే ఫస్ట్ గేర్ లో నెమ్మదిగా వెళ్లాలి. నీటిలో వాహనం ఆగిపోతే మళ్లీ మళ్లీ స్టార్ట్ చేయవద్దు, ఇంజిన్ లోకి నీరు వెళ్లి పాడయ్యే ప్రమాదం ఉంది. అందువలన మీరు నీరు ఎక్కువగా ఉన్న చోటు నుంచి వెళ్లాలి అనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.