
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ నాటడం వల్ల ధనాకర్షణ పెరగడమే కాకుండా సానుకూల శక్తి పెరుగుతుంది. అయితే ఈ మొక్కను సరైన దిశలో ఉంచినప్పుడే పూర్తీ ఫలితాలు లభిస్తాయి. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్‌ను ఇంటికి ఆగ్నేయ దిశలో ఉంచడం అత్యంత శుభప్రదం. అలాగే మనీ ప్లాంట్‌ను ఈశాన్య దిశలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఉంచకూడదని, అది ఆర్థిక నష్టాలకు దారితీస్తుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

మనీ ప్లాంట్‌కు సరైన దిశ: ఆగ్నేయం వాస్తు నిపుణుల ప్రకారం మనీ ప్లాంట్‌ను ఎల్లప్పుడూ ఇంటికి ఆగ్నేయ దిశలోనే ఉంచాలి. ఆగ్నేయ దిశకు అధిపతి విఘ్నేశ్వరుడు కాగా, గ్రహాధిపతి శుక్రుడు. గణపతి విఘ్నాలను తొలగిస్తే, శుక్రుడు ఐశ్వర్యాన్ని, వైభవాన్ని అందిస్తాడు. అందువల్ల ఈ దిశలో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరిగి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

ఏ దిశలో ఉంచకూడదు?: మనీ ప్లాంట్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ ఈశాన్య దిశలో ఉంచకూడదు. ఈశాన్యానికి దేవగురు బృహస్పతి అధిపతి, అలాగే ఆగ్నేయానికి చెందిన శుక్రుడు పరస్పర విరుద్ధమైన గ్రహాలు. ఈశాన్యంలో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై ధన నష్టం కలగడమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది. అలాగే తూర్పు, పడమర దిశలలో కూడా పెట్టకపోవడమే మంచిది.

మనీ ప్లాంట్ పెంపకంలో పాటించాల్సిన వాస్తు జాగ్రత్తలు: మనీ ప్లాంట్ తీగలు ఎప్పుడూ పైకి వెళ్లేలా మద్దతు ఇవ్వాలి. తీగలు నేలను తాకకూడదు. తీగలు కింద పడితే ఆర్థిక పతనాన్ని సూచిస్తుంది. మొక్కలో ఆకులు పసుపు రంగులోకి మారినా లేదా ఎండిపోయినా వెంటనే వాటిని కట్ చేయాలి. ఎండిన ఆకులు ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయి.

మనీ ప్లాంట్‌ను ఎక్కువగా ఇంటి లోపల పెంచడం శుభప్రదం. దీనిని ఎండ తగిలేలా బయట పెట్టడం కంటే నీడలో ఉంచడమే మంచిది. ఈ మొక్కను ఆకుపచ్చ లేదా నీలిరంగు గాజు సీసాలో ఉంచి నీళ్లు పోస్తే వాస్తు ప్రకారం మరింత మంచి ఫలితాలు ఉంటాయి. సరైన వాస్తు నియమాలు పాటిస్తూ ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్‌ను పెంచడం ద్వారా ఇంట్లోని వాస్తు దోషాలు తొలగి, లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరిసంపదలు కలుగుతాయి.